పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                  అవి వెలుగులు కావేమో ! ఏదో తాటాకు, పాతగడ్డి మండించిన పొగచూరిన మంటల్లా ఉంటవి అని పకపక నవ్వాను. అతడు రాసిన పాట విను నీకే తెలుస్తుంది!

'బ్రతుకలేనే ఓ ప్రియా

కత లెరిగి నీ పెదవి

విత మెరిగి శ్రుతి మరచి

గతి తప్పి అడవిలో

వితము తెలియని నేను

బ్రతుకలేనే ఓ ప్రియా

కత లెరిగి నా పెదవి....'

    ఈపాట అతడు ఎందుకు రాసినట్లు ?

     ఈపాటలో నా అందాని కాతడు జోహారు లర్పిస్తున్నాడట !

     నిన్ను ముద్దు పెట్టుకున్నట్లు రాస్తాడే ?

    నిశాపతి ఢిల్లీకి వెళ్ళిన రోజున తోటలో అతనూ నేనూ తిరుగుతుంటే, తటాలున నా చేయి ముద్ద్దు పెట్టుకొని నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ మరునాడు ఈ పాట రాసుకొచ్చి నాకు చూపించాడు.

     నీ యౌవనం సాఫల్యం అనుభవించలేదా? ఆ ముద్దు నీ అందానికి హారతి కాలేదా ?

     హారతో , నివేదనమో నాకు తెలియదుకాని, అతని స్నేహానికి ఆ ముద్దుకూ శ్రుతి కలిసింది కాదు. నాకు అసహ్యం వేసిందన్నమాట నిజం. ఆ రోజున నీవు బల్లవద్ద నుంచొని ఉండగానే, నేను డేటాలు నీటితో చేయి కడుక్కొనే వచ్చాను.

    త్యాగతి మాట్లాడకుండా తల క్రిందకు వాల్చుకొని చేతితో నీల మీద యేవో గీతలు గీస్తున్నాడు.

    అందరూ నాకర్ధమయ్యారు కాని త్యాగతి నా కర్ధంకాడు! అతని మౌనంలో యే మేమి భావాలు నిశ్చలపక్షాలు చాపి తెలిపోతున్నవో !

     నేను హైస్కూలులో విద్యార్దినిగా ఉన్నప్పుడు, ఇద్దరు, ముగ్గురు బాలకులు నన్ను ముద్దు పెట్టుకోబోయారు. నా చుట్ట మొకాయన, నా క్లాసు మేట్సు యిద్దరు. నాకు అసహ్యము వేసింది; ఏదో సంతోషము వేసింది. ఆ సంతోషముయొక్క తత్వముకాని, ఆ అసహ్యత యొక్క తత్వముకాని నాకీ నాటికీ తెలియడంలేదు. నా కనుబొమలు ముడివడడంలోని కోపం చూచి ఆ ముగ్గురిలో ఇద్దరు అక్కడనే ఆగిపోయినారు. నా కనుపాపలలోని సంతోషము చూచి కాబోలు ఆ ముగ్గురిలో ఒకడైన నా క్లాస్ మేటు రెండో సారి నన్ను కౌగిలించుకునే ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు నాచేత లెంపకాయ తిన్నాడు. అంతటితో ప్రణయ కార్యకలాపము చల్లారి పోయింది.

    ఆ మాటలని ఆలోచనలో పడ్డాను. ఇద్దరం కొంతవరకూ మౌనంగా వున్నాం.