పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్ప : అతడు మంచివాడు. మనుష్యుని వెనకాల అతన్ని వెక్కిరించడం పురుష లక్షణం కాదు.

    నేను : ఆయనకూ, నాకూ పరిచయం కలిగినది ఈ ఏడాదిలోనే.అయినా ఎంత స్నేహితుడైనాడు.

    కల్ప : ఈవాళే ఆ ప్రశ్న మనలో పుట్టిందేమిటి?

    నిశా : ఆ ప్రశ్న నా మనసులో ఎప్పుడూ ఉండనే ఉన్నది.

    తీర్ధ : అడగనా నువ్వెవరని?

    నేను: అలాంటి తెలివి తక్కువ పనులు చేయకు.

    కల్ప: ఆయన ఎవరో పూర్తిగా తెలపటం అనే ఇటువంటి ముఖ్యమయిన విషయంలో ఆయన ఉదాసీనత వహించగలడా? ఎవరి రహస్యాలనైనా మనం మన్నించాలి.

    నిశా: ఈ ఏడాదినుంచీ రహస్యం వీడని స్నేహం అంత గొప్పదా మనం గౌరవించడానికి?

    నేను : అలాంటి స్నేహాన్ని నేను మాటాడకుండా గౌరవించాను కాదా? పైగా ఏమి రహస్యాలున్నాయి ఆయన జీవితంలో! మహాశిల్పీ, చిత్రకారుడూ అతడు.

    తీర్ధ : నిన్ను బట్టే మేమంతా గౌరవిస్తున్నాము; లేకపోతే....

    నిశా : ఈ జిడ్డు ఆముదం ఎవరిక్కావాలి ?

    తీర్ధ : తంటసాన్ని ఎవరు కోరుకుంటారు కావాలని!

    కల్ప: ఈ రోజున మన కందరికి జ్ఞానోదయం అవుతున్నది.

    నేను: అయితే మా తండ్రిగారి కతడంటే వున్న గౌరవం టంగు టూరి ప్రకాశంగారన్నా లేదు.

    తీర్ధ  : ముసలివాళ్ళు ముసలివాళ్ళని గౌరవిస్తారు.

    కల్ప : ఆయనకు ముప్ఫై, ముప్ఫైఒకటి కన్న ఎక్కువ వయసు వుండదు, ఇరవై అయిదేళ్ళ యువకునిలా వుంటాడు.

    నిశా : మామయ్యా గారు అరవై ఏళ్ల వారులా వుంటారా ? ముఫ్ఫై ఏళ్ల మూర్తిలా వుండరు మరీ!

    నేను : ఇదంతా శుష్కవాదన. ఏ కారణం అయితే ఏమి, త్యాగతి నా స్నేహితుడు.

    ఈలా ఒకనాడు త్యాగతి లేకుండా వాదన జరింగింది. అదంతా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ ఆలోచనలన్నీ త్యాగతి యాలక్కాయ నోట్లో వేసుకొనే లోపుగానే నా హృదయంలో మెరుముల్లా మెరసి మాయమైపోయినవి. తీర్ధమిత్రుడు పెదవులతో నా దేహాన్ని స్పృశించినంత మాత్రాన్నే నేను మైలపడి పోయాననుకునే చ్చాందసురాలిని కాను. ఇష్టతాయిష్టతలు యే కారణాలబట్టి యేర్పడతవో ? ఇష్టతాయిష్టతలు మానవ జీవిత చరిత్రకు యెన్ని రకాల ప్రకరణాలను సృస్టిస్తున్నవో? ఆడదాని జీవితము మగవాడి జీవితముతో కలిపి వేసుకోవడంతోనే