పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్పమూర్తి : పాశ్చ్యాత్య దేశాల్లో స్త్రీ పురుషులు ఎక్కువ తక్కువలను చదువును బట్టి ఏర్పరచలేదు !

తీర్ధమిత్రుడు : ధనాన్ని బట్టా ?

నిశాపతి : వారికుండే తెలివితేటల్ని బట్టి.

నేను : ఎవరి ఉలుకు వారు బయట వేసుకుంటున్నారు.

త్యాగతి : (మౌనం)

కల్పమూర్తి : పాశ్చ్యాత్య దేశాలు మనకి వరవడా?

నేను : వారివల్ల మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయిగా!

త్యాగతి : (మౌనంతో సిగరెట్టుపొగ వదులుతున్నాడు.)

తీర్ధమిత్రుడు : మనలో లక్షలోట్లు ఉన్నప్పుడు యితరులు ఏర్పరచిన రాజబాటను సరిగ్గా నడిస్తే మనజీవితం సునాయాసముగా అవుతుంది.

నిశాపతి : మనదగ్గర మాత్రం వాళ్ళు నేర్చుకోవలసినవి లేవా ?

తీర్ధమిత్రుడు : ఒకటో రెండో మంచి సంగతులు కొన్ని నేర్చుకొనే ఉన్నారు.

కల్పమూర్తి : ఏమిటా ఒకటో రెండో ?

తీర్ధమిత్రుడు : కొద్దిగా వేదాంతం, అత్తరువులు గిత్తరువులు ఉపయోగించడం....

నేను : అయితే మనదేశం ప్రపంచానికి ఏమీ యివ్వలేదంటావా?

త్యాగతి : (మౌనంతో సిగరెట్టు ఆర్పి, సిగరెట్టు బూడిద గిన్నెలో వేశాడు.)

తీర్ధమిత్రుడు: అనారోగ్యాలు , చాతబడులు , దెయ్యాలు , దేవతలు , భయాలు నేర్చుకోమన్నావా ?

నేను : నీ వాదమంతా మనదేశం మీద అసహ్యత, పరదేశాలమీద భక్తితో బయలుదేరినవే కానీ,న్యాయాన్యాయ విచారణ దృష్టితో బయలుదేరింది కాదు.

త్యాగతి : ఒకదేసానికీ, ఒకదేసానికీ,సమానసంబందం కలిగి వుంటే, వారి ఆచారాలు కొన్ని వీరికీ, వీరి ఆచారాలు కొన్ని వారికీ వస్తాయి. అందులో కొన్ని చాలా అందంగానూ, కొన్ని చాలా అసహ్యంగానూ కనపడతాయి. బానిసలకీ, ప్రభువులకీ సంబంధంలో, బానిసలకి ప్రబువుల ఆచారాలు బాగున్నట్లు కనబడ్డం సహజం.

అందరూ మౌనం.

                                                                                                     8

మర్నాడు పొద్దున్నే నేను నిద్రలేచి, మొహం కడుక్కుని, యివతలికి వచ్చేటప్పటికి తీర్ధమిత్రుడు తయారు. కాఫీ పుచ్చుకొని తోటలోకి షికారు వెళ్ళాం. మా యిద్దరి చుట్టూ దక్షిణపుతోట, నందనవనానికి పాఠాలు నేర్పే సోబగులాడి. ఆ వనదేవత మమ్మల్ని కౌగిలిస్తోంది. ఆ పువ్వుల సువాసనకు నాకు వివశత్వం కలిగిస్తున్నది. నా యౌవనం సాఫల్యానికై చేతులు చాస్తున్నది. రంగువేయని ఎఱ్ఱని నా పెదవుల్లో అమృతాలు ఆస్వాదనకై పరెవళ్ళు త్రోక్కినవి. నా మనసులో కల్పమూర్తి పూజా నయనాలతో మోకరించి