పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాలుగు వడగళ్ళేరి నీళ్ళుకాచి, కాఫీ తయారుచేసుకొని త్రాగాను. సిగరెట్టు వెలిగించి రెండుగంటలలాగే కూర్చున్నాను. చీకటి అలముకుపోయింది. ఉన్ని గొంగళి కోటుక్రింద వున్న తోలుకోటులోపల ఉన్నిదుస్తులు నాకు చలి బాధను కలిగించలేదు. ఒక గంట కురిసి వడగండ్లవాన వెలిసింది. గాలి జోరుమాత్రం తగ్గలేదు. వేసవికాల మవడంచేత దారి పూడుకుపోదని మాత్రం ధైర్యం.

   తీర్థయాత్రకు  పోయేవారంతా  రానూ, పోనూ  మూడురోజులు  ప్రయాణం  చేస్తారు. నే  నున్న  తావుకు  దిగువను  పదునొకండు మైళ్ళ  దూరంలో  బదరీపురం  ఉంది. ఈ  కొంచెం  దూరంలోనే సర్వమానవ  జగత్తు నాకు  వేలకొలది  మైళ్ళు  దూరమైపోయినట్లే తోచినది.
   ఒక  చిన్న  జంతువు  దాగేటందుకు  మాత్రం  సరిపోయే  ఆ స్థలంలో  ఇన్ని ఎండు చితుకులు  పోగుచేసి  వంటచేశాను. దేవదారుపుల్లలు బాగా  మండుతూ సువాసనాధూపాలను ఎగజిమ్ముతున్నవి. ఆ  విచిత్ర  నిశ్చలతలో నాకు  సంపూర్ణమైన  మెలకువే. నిద్ర  రానేలేదు.  మత్తయినా కలగలేదు. ఎన్ని ధ్వనులు  నిండివున్నా  అవన్నీ  ఆ  నిశ్చలతలో  అంతర్భాగాలయ్యాయి.   అలాగే  కూర్చున్నాను.  నాచేతి  గడియారంలో  రెండు అయ్యేసరికి  నిప్పు ఆరిపోయింది. ఆ  చీకటిలో, ఆ వెలుగులో, ఆ  చీకటి  వెలుగులలో అలానే  కూర్చుండి వున్నాను. నడుం నొప్పి  పెట్టలేదు.  ఆలోచనలు ఆఖరయ్యాయి.  బుద్ధి  నిశితత్వం తాల్చింది. స్పష్టమయిన ఆలోచనలు మొక్కలు మొలిచి  వృక్షాలై  పుష్పాలు పూచినవి.

ఏ విషయమైనా మనుష్యుల బుద్దిమీదనే ఆధారం. బుద్ది ననుసరించి సిద్దాంతం. సిద్దాంతాన్ననుసరించి మనుష్యుల ఆచరణ ఉంటుంది. అన్ని ఆచరణలకు అతని స్వీయసిద్ధాంతాలు ఆధారం కాకపోవచ్చును. అవి చిన్న పనులు. అప్పటి తాత్కాలిక పరిస్థితుల ననుసరించి ఉంటవి. కాలానికి మనుష్యుడు దూరమవడమేకదా అయిన్ స్టీన్ నాల్గవపథము. ఆకాశంలోని కొన్ని నక్షత్రాలకు మూడువేల సంవత్సరాలనాటి భూమిలోనాని చరిత్ర కనబడుతూ ఉంటుంది. కొన్ని తారలకు నూరు సంవత్సరాలనాటి చరిత్ర. ఇంక కొన్నింటికి ఏడాది క్రిందటి చరిత్ర దర్శనము అవుతూ ఉంటుంది. ఒకే క్షణంలో ఈలాంటి కాలవ్యత్యాసాలు విశ్వంలోవుంటే, సంఘటన, సందర్శనము మనుష్య మనుష్యునికి తేడాలుగా వుండాలి? అందులో వివధ హృదయాలకు దృష్టి వైవిధ్యమూ, గ్రహణవైవిధ్యము అనంతరూపాలుగా వున్నవి. ఈ వైవిధ్యస్థమై, వైవిధ్యాతీతమైన ఒక సత్యమేదో ఉండాలి కదా? అది భౌతికానుభవంలోనే ప్రత్యక్షమవుతున్నప్పుడు, బుద్దికతీతమైన మహాసత్య మొకటి ఉండాలికదా? ఈ సత్యము ఇతరులెవ్వరూ బోధింపలేరు. ఎవరికి వారే గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. గురువు మార్గం మాత్రం చూపిస్తాడు.

   జనసమ్మర్ధంలో సంగీతం  వినబడదు. జనం హోరులో  ఆలోచన  ఏకధారకాదు. కళాశాల  శాస్త్రపరిశోధనాలయము  వీధిలో  పెట్టగలమా? అలాగే