పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెద్ద. అంత పెద్ద చదువు లేదు. కాని చాల మంచివాడు. వ్యవహారవేత్త. మా హేమ అతన్ని చూచింది, రండు మూడు సార్లు. (జ్ఞాపకం తెచ్చుకో హేమా)


   మేమంతా ఆ  వేసవికాలం  జూన్ నెల  వానలవరకూ మస్సోరీ  నగరంలోనే ఉన్నాము. మేము మస్సోరీ  వెళ్ళేటప్పుడు సుశీల  ఎంత ఏడ్చిందో  వర్ణించలేను. నన్ను  అమిత  గాఢంగా  నన్ను కౌగలించుకొని  వదలలేదు. ఆమెకు  ఏడవనెల  గర్భం. ఆమె భర్త  జగత్ రాం పండా  అన్ని ముచ్చట్లు జరిపించినాడు.
   మూర్తీ! నువ్వు  నా జీవితంలోంచి  వెళ్ళడానికి వీలులేదు. నువ్వు బ్రతికావు! నేనూ బ్రతికాను.  నువ్వు  మస్సోరి నుంచి  ఇక్కడికే రా. మా  ఇంట్లో ఉండు. ఉంటావుకదూ?  అని  ఎంతో  బ్రతిమాలింది. నే  నామేను  ముద్దుపెట్టుకొంటూ తప్పక  వస్తాను సూసీ అని  వీడ్కోలిచ్చాను. నే నాక్షణంలో  ఏమీ  ఆలోచన చేయలేని  నల్లరాయిలా అయిపోయాను.
   మస్సోరీలో మొదటి  రెండు మూడు వారాలు నేనూ,  మా సుబ్బులు బావా  మహా  ఆనందంగా  గడిపాము. సుశీల, శకుంతలా  ఎవరూ నా హృదయంలో  లేరు.  ఆ  తర్వాత  నాకు కాశీ  విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. రాత్రిళ్ళు  నిద్రపట్టకపోవడం  తిరిగి ప్ర్రారంభించింది.   
   బలం  త్వరలో  పట్టడంచేత  ఆ  మహాపర్వత  సానువులన్నీ మా  సుబ్బులుతో  తిరిగేవాణ్ణి, దూరాన మాకు  ధవళహిమ కిరీట సుందరాలైన  ఆ  పర్వతరాజు  శిరము  లెన్నో  గోచరించేవి. ఆ  కొండల్లో  ఒక్కొక్క రోజు  గంటలకొలదీ  నడిచేవాళ్ళము? చెట్లను   కోసిన  ఆపిల్సుపండ్లు, దానిమ్మపండ్లు, ద్రాక్షపండ్లు  విపరీతంగా  తినేవాణ్ణి. నడిచి నడిచి వచ్చి, సొమ్మసిలి నిద్రపోయేవాణ్ణి. ఈ  నడకలు  శకుంతలా సుశీలలను దూరంగా తోలటం  కోసమే! నాలో  సుడిగాలులు  వీస్తున్నవి  మా  సుబ్రహ్మణ్యానికేం  తెలుసును!
   నెలరోజు లుండేటప్పటికి, మస్సోరీ  నాకు విసుగు పుట్టించింది. ఆ ప్రపంచంలోనే  నొంటి వాణ్ణయ్యాను. నా శకుంతలను మరచి, ఒక విధంగా స్వైరిణి  అయిన  సుశీలతో   కామవాంఛ తీర్చుకున్న  ద్రోహిని నేను. శకుంతల  నాపై  దీనదృష్టులు   పరుపుతోన్నట్లే  భావించేవాణ్ని.
   సుశీల మాత్రం  ఏం తప్పుచేసింది? ఆమె  ధర్మం  ఆమె నిర్వర్తించింది. నేనే నీరసుణ్ని. ఏమిటా   ప్రేమ? ప్రేమకోసం  జీవితాలు  బ్రహ్మచర్యానికి  అంకితం  చేస్తారా?  వెనుకటి  కథలే  నిజమైతే  విశ్వామిత్రుడు  మేనకతో,  వేదవ్యాసుడు మరదళ్ళతో  నిర్వహించిన  ధర్మం ఏమిటి? పుణ్యపాపాలూ సత్యంలా  సర్వకాలాలూ  ఒకేరీతి ఉండాలి. అవి కాలాన్ని బట్టి  మారితే  సుశీలకూ నాకూ, ఆ  సాయంకాలం  సంభవించిన  కామవాంఛా  నిర్వహణం  పాపం ఎలా అవుతుంది?
   నెమ్మదిగా నా  ఆలోచనలు  నశించాయి: ఒక విధమైన  స్థాణుత్వం  వచ్చి చేరింది.  మూర్ఖుడు  సర్వప్రపంచంపైన   అమితక్రోధం వహించినట్లుగా నాకు  అన్నింటిమీద  కోపం ఆవహిల్లింది.  మా  సుబ్రహ్మణ్యంపై  ఉదయాత్తు