పుట:Thittla gnanam.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెళ్లిదినముననే ఎంతో జ్ఞానముతో కూడుకొన్న పెళ్లి, బాషింగములు, తలంబ్రాలు, అక్షింతములు, తాళి, పందిరి, అరుంధతి నక్షత్రము మొదలగు కార్యములలో అంతరార్థమును తెలిసి వైవాహిక జీవితము ప్రారంభించితే ఆ జీవితము శుభప్రదమగును. పెళ్లి దినమున అటువంటి జ్ఞానపద్దతి చెప్పువారుగాని, వినువారుగాని లేకుండ పోయినారు. కావున వైవాహిక జీవితము అశుభముతో కూడుకొన్నదై, పెళ్లికాలము ప్రమాదములతో పొంచివున్నదై, ఎన్నో రోడ్డు ప్రమాదములు, అగ్ని ప్రమాదములు పోట్లాటలు జరుగుచుండుట అందరికి తెలిసినవిషయమే. ఏదో ఒక ఆటంకము ప్రమాదము కలుగజేయు వివాహముల గురించి ఇప్పటికైన యోచించ వలసియున్నది.


జీవితములో దేవుని జ్ఞానమునకు దూరమగుటకు, దైవమార్గమునకు అడ్డమగు వారిని వివాహసమయమునుండి భార్యరూపములో భర్త పొందుచున్నాడు. అదే విధముగ భర్తరూపములో భార్య కూడ పొందుచున్నది. భార్య తలకు జ్ఞానమును నింపుతానని బియ్యమును తలంబరాలు అను పేరుతో భార్య తల మీద పోసిన భర్త భార్యకు జ్ఞానమును అందివ్వడము లేదు. అదేవిధముగ భర్త తలకు జ్ఞానమును అందిస్తానని జ్ఞానచిహ్నమైన చంద్రుని ధాన్యమును జ్ఞానముతో సమానముగ తలచి భర్త తలమీద బియ్యమును పోసిన భార్య భర్తకు జ్ఞానమును అందివ్వడము లేదు. పెళ్లిదినమున కార్యరూపములో చేసిన పనులకు అర్థము తెలియక మానవుడు ఆ దినమునుండి మరీ అజ్ఞానములో కూరుకు పోయాడు. మనిషికి వివాహజీవితము అశుభముతో కూడినదై కర్మను సంపాందిచుకొనుటలోనే సరిపోవుచున్నది.

-***-