పుట:Thittla gnanam.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రకములున్నప్పటికి ఒకటి కర్మాతీతమై నెరవేరునదై ఉన్నది, రెండవది కర్మాధీనమై నెరవేరునని చెప్పుటకు వీలులేనిదై ఉన్నది. ఇష్ఠార్థము అన్నపుడు శ్రద్ధను బట్టి అను అర్థమొచ్చును. "ఇష్టార్థ ఫలసిద్ధిరస్తు" అన్నపుడు శ్రద్దను బట్టి ఫలము సిద్ధించవలెనని చెప్పడము. నీశ్రద్ధను బట్టి ఫలము కలుగవలెనని పెద్దలు చెప్పినప్పటికి ఆ వాక్యము దీవెనగ మారవచ్చును లేక దూషణగ మారవచ్చును. ఒకే వాక్యము దీవెనగ మరియు దూషణగ ఎట్లు మారుచున్నదనగా! ఒక మనిషికి జ్ఞానము మీద శ్రద్ధయున్నపుడు పెద్దలు అతనికిచ్చిన వాక్యము దీవెనగ మారును. ఎందుకనగ వానికి లభించునది జ్ఞానము, కనుక శుభమును చేకూర్చు వాక్యము కావున దానిని దీవెన అనవచ్చును. జ్ఞానమును గురించి దీవించకున్నను అతనికెట్లయిన జ్ఞానమేలభించును. దీవించితే వానికి దీవెన బలము కూడ చేకూరును. ఒకవేళ మనిషికున్న శ్రద్ధ విషయశ్రద్ధ అయితే, అది నెరవేరవలెనని దీవించినప్పటికి అది మరుజన్మమున నెరవేరినప్పటికి, ప్రపంచ విషయములలో కూరుకపోయేదే, కావున అది దీవెనగ కనిపించినప్పటికి వాస్తవముగ దానిని దూషణ అనియే చెప్పవచ్చును. "ఇష్టార్థ ఫలసిద్ధిరస్తు" అను వాక్యము ఒక్కటి మాత్రము ఒకప్పుడు దీవెనగ, మరొకప్పుడు తిట్టుగ మారుటకు అవకాశము గలదు. ఇష్టము అనిన శ్రద్ధ అనిన రెండు ఒక్కటే, అలాగే ఆశ అనిన కామము అనిన రెండు ఒక్కటే. కావున ఇష్టార్థమునకు కామ్యార్థమునకు ఎంతో తేడాగలదు. ఇష్టము జీవునికిగల స్వంత హక్కు కాగ, ఆశ గుణచక్రములో గల మొదటిగుణము. గుణములకు సంబంధించిన వాక్కు ఏదైన వాస్తవముగ దూషణ అగును. అలాగే జ్ఞానమునకు సంబంధించిన వాక్కు ఏదైన వాస్తవముగ దీవెన అగును. గుణములకు సంబంధించినవేవైన విషయసుఖములలో ముంచునని,