పుట:Thimmarusumantri.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

తిమ్మరుసు మంత్రి


బాధింపఁగా వార లీతనిబాధ పడలేక గోపురము పైనుండిపడి ప్రాణత్యాగమును గూడఁ జేసికొనిరఁట! ఈసమాచారము తిమ్మరుసునకుఁ దెలియవచ్చెను. తిమ్మరుసుమంత్రి శైవవైష్ణవ మతములయందు సమబుద్ధి గల స్మార్తుఁ డగుటచేత కోనేరినాథుని దుండగములను నివర్తింపఁజేయుట శ్రేయోదాయకమని నరసరాయనిఁ బ్రేరేపించెను. అతఁడు నాగమనాయని, కుమార నరసరాయని (వీరనరసింహరాయలు) వెంట నిడికొని తిరుచునాపల్లి మండలమునకుఁ బోయినపుడు కోనేరినాధుఁ డీసమాచారముఁ దెలిసికొని బహుసైన్యములం గూర్చుకొని వీరి నెదుర్కొని ఘోర సంగ్రామము సలిపెను. తుళువనరసరాజు కోనేరినాధుని రణరంగమున నోడించి సంహరించెను, అంతట నరసరాజు నాగమనాయకుఁడు కుమారనరసనాయకుఁడు శ్రీరంగమునకుబోయి రంగనాథుని సందర్శించి భక్తి యుక్తముగ నా దేవునకు భూదానములను బెక్కులను గావించిరి. కోనేరినాథునకు భయపడి స్వగృహములను విడిచి పాఱిపోయిన వైష్ణవస్వాముల కభయమొసంగి స్వస్థానమునకు రప్పించి యుత్సాహముఁ గల్పించిరి.

బహమనీరాజ్య విభాగములు.

అవక్రపరాక్రముఁడై అరాతిజనభయంకరుఁడై ఇమ్మడి నరసింగరాయని దూరముగాఁ గూరుచుండఁబెట్టి తానే సార్వభౌముఁడైనట్లుగా సామంతనృపవర్గముచే మ్రొక్కులను బడయు