పుట:Thimmarusumantri.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

తిమ్మరుసు మంత్రి


శ్రీకృష్ణదేవరాయని సాహసము

ఇట్టి విజయమునకు గర్వించి కృష్ణదేవరాయఁడుప్రతాపరుద్రగజపతికి నివాసపట్టణ మై రాజధానీనగర మై యున్న కటకమును బట్టుకొనవలయు నని సంకల్పించెను. తిమ్మరుసు దానిని గ్రహించి రాయని కిట్లు హితవు గఱపెను. ఓమహా రాజేంద్రా! మనము రాజధానిని విడిచి యిప్పటికే బహుదూరము వచ్చి యున్నారము. ఇంతటితోఁ దృప్తి నొందక మనము ముందునకు సాగితిమేని మనబలము క్షీణించుటయును, శత్రుఁబలము పెరుఁగుటయు సంభవించును. గజపతి బలాఢ్యుఁడైన శత్రువు గాని సామాన్యశత్రువు గాఁడు, అతని జయించుట కష్టసాధ్యము. ఇంతటితో మనము తృప్తి నొంది వెనుకకు మరలుట యుత్తమమార్గ మని తోఁచు చున్నది. అని తిమ్మరుసు రాయని దండయాత్రనుండి మరలింపఁ జూచెను గాని మహాపరాక్రమవంతుఁడైన యామహాప్రభువు "అప్పా ! అడ్డు పెట్టకుము. శత్రువు నవలీల జయింతును. సైన్యము చాలకయున్న విజయనగరమునుండి తెప్పింపుము. దండయాత్ర కటకపురినిఁ బట్టుకొని ప్రతాపరుద్రుని వశపఱచుకొన కుండ నిలుపుట నాకెంతమాత్రము నిష్టము లేక యున్నది. కావున నీవు సత్వరముగా విజయనగరము సైన్యముల కై సమాచారమంపి ముందుకు ప్రమాణము సాగింపు మని పలికెను. అంత తిమ్మరుసు భయమును సంశయమును బొందినవాఁ డయ్యును రాయనికిఁ దెలి