పుట:Thimmarusumantri.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్ఠమప్రకరణము

117


యనీయక యతఁ డెట్లును మానువాఁడు గాఁడని గ్రహించి యిష్టము లేకపోయినను సమ్మతింప వలసినవాఁడయ్యెను. అట్లనే కానిమ్మని పైనిచెప్పిన ప్రకారము కొండవీటిరాజ్యమునకుఁ దనమేనల్లుఁడైన నాదిండ్ల అప్పామాత్యుని బ్రభువునుగాఁ జేసి తాను గృష్ణరాయనితోడ రాజమహేంద్రపురదుర్గమును ముట్టడింపఁ బోయెను. దారిపొడవునను గజపతి సైన్యములతోడ యుద్ధమును జేయుచునే యుండెను. ఓడించిన కొలఁది గజపతి సైన్యములు నిరుత్సాహముం జెందుచు వెనుకకుఁ బాఱుచుండుటయు, రాయని సైన్యము లుత్సాహవంతములై తరుముకొని పోవుచుండుటయు సంభవింపుచుండెను. కొన్నినెలలకు విజయనగరమునుండి సైన్యములువచ్చి రాయని సైన్యములఁ గలిసికొనియెను.

రాజమహేంద్రపురమును గైకొనుట.

ఇట్లు లక్షలకొలఁది సైన్యములను నడిపించుకొనుచుఁ గృష్ణదేవరాయఁడును, సైన్యాధ్యక్షుఁడగు తిమ్మరుసుమంత్రియును కృష్ణాగోదావరీమధ్యస్థమైన దేశము నంతయును స్వాధీనపఱచుకొని గోదావరినదిని సమీపించిరి. మొదట గోదావరిని దాటి శత్రువులను బాఱద్రోలి రాజమహేంద్రపురము నాక్రమించుకొన్నసేనాని ఆకువీటి యిమ్మరాజు; పింగళి సూరనామాత్య కవిపుంగవునిచే రాఘవపాండవీయ మనుద్వ్యర్థికావ్య కృతిపతియైన వేంకటాద్రియొక్కతాత యీయిమ్మరాజే.