పుట:Telugu merugulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

తెలుఁగుమెఱుంగులు


'మెఱుమ్ గళ్' అయ్యెను. 'కళ్' ప్రత్యయయే తెలుఁగుఁదనమును బడయునాఁటికిఁ బెక్కుశబ్దములమీఁద 'గులు' గాను 'గలు' గాను, 'కులు గాను 'కలు' గాను మాటి, తొలియక్షరములగు 'గు' 'గ' కు 'క' లు పాత్రిపదికమునఁగలసి బహువచన ప్రత్యయముగా, 'లు' మాత్రమే మిగిలెను. అడుగులు, నుడుగులు, గొడుగులు, వెలఁగలు, ఈగలు, కొలఁకులు, వలఁకులు, చిలుకలు, ఎలుకలు ప్రభృతు లిట్టివే. క్రమముగా మెఱుమ్ముళ్, మెఱుముళ్, మెఱుముళు, మెఱుములు అను రూపము లేర్పడెను. ఇక్కడ వికల్పముగా శిథిలద్వీత్వ మేర్పడుటచే మకారమును ఊఁడి పలుకుట, తేల్చిపలుకుట యను భేదముచే రెండురూపము లేర్చడినవి. ప్రాకృతసంప్రదాయమునుబట్టి వర్గానునాసికములకు సున్న పెట్టుట యేర్పడఁగా 'మెఱుంగులు' అను రూప మేర్పడెను. ద్విత్వము: శిథిలము కానప్పుడు ప్రాయికముగా 'మెఱుంగులు' అను లిపియును, శిథిల మయినప్పుడు 'మెఱుగులు' అను లిపియును ఉండెను. లిపిలో అరసున్న ప్రాంత మున్నూజేండ్లకు ముందు లేనేలేదు, ఈ బహువచన రూపముననుండి ప్రత్యయావయవమగు 'గు' ప్రాతిపదికమునఁ జేరఁగా మెఱుంగు, మెఱుఁగు అని యేకవచన రూపములు పుట్టెను. నన్నయ నాఁటి కీపరిణామము ప్రబలమయి శిథిలద్విత్వ మను వ్యవహారము శిథిలము కాఁజొచ్చినది. ప్రాకృత సంప్రదాయము చొప్పున వర్గానునాసికము: తొలిహల్లుగాఁగల సంయుక్తాక్షరములందు అనునాసికమునకు బదులు సున్న నుంచుసంప్రదాయము పెంపొందఁ జొచ్చినది. కర్ణాటకభాషలో గొన్ని శబ్దముల ద్విత్వమునకు నిత్యముగాను, గొన్నింటికి వైకల్పికముగాను శైథిల్యముగలదు. అట్టిపదములు మన తెలుఁదనమును బొందునాఁటికి! గొన్ని యశిథిలద్విత్వములుగానే నిలిచినవి. కొన్నింట ద్విత్వము లోపించి మొదటిదో, రెండవదో ఏదో ఒకహల్లే నిలచినది. కొన్నింట ద్విత్వము