పుట:Telugu merugulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

తెలుగుమెఱుంగులు


కాళీదాసకవి మేఘసందేశ మని క్రొత్త తీరు కావ్యము రచింపఁగా, హనుమత్సందేశమును మనసులో ఉంచుకొని రచించె నన్నారంట- నాటి విద్వాంసులు.

నన్నయభట్టుగారు మొదలుకొని చిన్నయసూరిగారి దాఁక ఎన్నికగన్న ఆంధ్రకవులు రచించిన ప్రబంధముల పలుకుబడి విద్యావికేములు గల యాంధ్ర ప్రజల హృదయములపై విశేషముగా సాగుచున్నది.

రాములు, లక్ష్మణులు, భరతులు, రావణులు, విభీషణులు, సీతలు, కౌసల్యలు, కైకలు, మంధరలు,ధర్మరాజులు, ఉత్తరకుమారులు, ప్రహ్లాదులు, హిరణ్యకశిపులు, గుణనిధులు, నిగమశర్మలు, వరూధినీ ప్రవరులు, కరటకదమనకులు, సుగాత్రీశాలీనులు, ఆషాఢభూతులు, కీలోత్పాటులు మొదలగువారు పురాణ పురుషులు, ప్రబంధపురుషులు నేఁడును అనేక స్థలములలో అనేకులు గుర్తింపఁబడుచున్నారు.

సామెతలు గ్రంధములలోని కెక్కినట్లు గ్రంధములలోని పద్యములుకూడ లోకవ్యవహారములలోని కెక్కినవి. అసలు ఆంధ్రప్రజల నిత్యవ్యవహారములలోనే కవిత్వగానములు కలగలు పైయున్నవి. ఆంధ్రభాష పుట్టుకయే కవితాగానాత్మకము.

వినాయకచతుర్థి, నవరాత్రములు అను పండుగనాళ్ళలో బాలకులచే పద్యములు పాడించుట, ప్రబంధములు చేతఁబట్టించుట నే నెఱుఁగుదును.


“ధర సింహాసనమై నభంబు గొడుగైత ద్దేవతల్ భృత్యులై
పరమామ్నాయములెల్ల వంది గణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుతియై
వరుసన్ నీ ఘనరాజసంబు నిజమై పర్ధిల్లు నారాయణా. "


ఇత్యాది పద్యములు నేను చాల పసిప్రాయమున నేర్చుకొన్నవి. వివాహములలో రుక్మిణీ కల్యాణ పద్యములను ముత్తయిదువలు ఆనంద భైరవిరాగముతో నాలాపించుచుండుట అనేకు లెఱుఁగుదురు.