పుట:Telugu merugulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

ప్రాచీన గ్రంథముల పలుకుబడికి

మనపై చెల్లుబడి


కవిత్వము, సంగీతము, నృత్యము, చిత్రరచన ఏ దేశములో ఏజాతిలో పెంపొందించుచుండునో ఆ దేశము, ఆ జాతి పాప ప్రవృత్తులకు దూరమై ఉండు నని, భగవదనుభూతికిఁ దగిన పరిపాకముగలదై ఉండు నని విజ్ఞు లందురు. తెలుఁగుజాతి, తెలుఁగుదేశము పైకళలో ముందడుగు వేయుచున్న దనియే నా నమ్మకము.

భారతదేశములోని అన్ని దేశభాషల సాహిత్యములును సంస్కృత భాషాసాహిత్యసంపద నాస్వాదించి జీర్ణించుకొని పుట్టి పెరిగినవే. మన తెలుఁగు సాహిత్యవాహినిలోకూడ తెలుఁగునాటివారి పలుకులతీరులు, తలఁపులతీరులు, కూర్పులతీరులు, ఫణితులతీరులు ఊట లూరఁగా ఊరఁగా స్వతంత్ర రచనలను సోనయేళ్లు కొన్ని జాలువాఱుచున్నను, సంస్కృతసాహిత్య ప్రవాహముకూడ అందులో ప్రధానముగా సాగుచునే ఉన్నది. నేఁటికిని, రేపటికిని ఉండఁగలదు.

వెన్నవలెం గరంగు సుకవిత్వము' చెప్పినవారు శ్రీశివశంకరశాస్త్రి గారు 'వకుళమాల' అని హృద్యకావ్యము నొకదానిని కూర్చినారు. ఆ వకుళమాలలోఁ గూడ భట్టుమూర్తిగారి యీక్రింది పద్యపుసువాసన గుబాళించుచున్నది.


కమనీయద్యుతిధామమా విమలముక్తాదామమా సేమమా
కమలామోదకు, తత్సఖీసమితికిం గల్యాణమా తన్మరా
ళ మయూరీ శుకశాజశారికల కెల్లన్ భద్రమా తెల్పుమా
ప్రమదారత్నము పేరుగా నేద నినున్ బాటించి ప్రార్థించేదన్,