పుట:Telugu merugulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుఁగులు

17


తేగలు, తాటిబెల్లము, తాటికల్కండ, తాటిపానకము, తాటికల్లు ఆహార పానీయముల క్రింద పనికివచ్చును. తాటిపండ్లు శిష్టులు ఆహారముగా నుపయోగింపరాదని నేఁటివారు కొంద అందురు. కాని దానికి ప్రమాణము నే నెఱుఁగను. మున్యాశ్రమములో మునులు తాడిపండ్లను ఫలాహారముగా నుపయోగించువా రనుటను కాదంబరిలోని యీ క్రిందివాక్యము నిరూపించు చున్నది. జాబాలి మహర్షి యాశ్రమవర్ణమున “ఉటజాజిర ప్రకీర్ణశుష్యచ్ఛ్యా మాక ముపసంగృహీతామలక, లవలీ, లవంగ, కర్కంధూ, కదళీ, లికుచ, చూత, పనస, తాళఫల, మధ్యయనముఖరవటుజన" మిత్యాది.

తాటిమ్రాని తుండ్లు జాతీయళ్ళపై కుందులుగా నుపయోగపడును. తాటియాకులతో గొడుగులు గావింతురు. తాటి యీనేలు, జవటలు, జీబులు చీపుళ్లగును. గులక చండ్లు, ఎండుమట్టలు, జీబులు మొదలగునవి యెల్ల వంటచెఱకున కుపయోగపడును. ఈ పేర్కొన్న యుపయోగములెల్ల పామరనాగరకసాధారణ మైనవి.

ఇఁక తాటిచెట్టు ప్రాచీనాంధ్రుల సాగరకతకు జీవరక్ష. ఆంధ్రుల విద్యావిజ్ఞానములెల్ల తాళపత్ర గ్రంథరక్షితములై యున్నవి. తాటియాకులను చక్కఁగా నీనెలు తీసి, చుట్టలు చుట్టి, పేడనీళ్ళలో తేలికగా నుడుకనిచ్చి, నీడనార్పి నేఁడు కాగితముల రీములు నిల్వచేసికొన్నట్లు పూర్వులు గ్రంథములు వ్రాసికొనుటకై 'అలేఖము'లను పేర నిలువచేసికొనెడివారు. జాబులను, భారత భాగవతాది గ్రంథములను వ్రాయుటకు నీ తాటియాకుల సుపయోగించువారు. శతాబ్దములదాఁక నీ తాటాకు గ్రంథములు చెడిపోక యుండెడివి. 'జాబు'కు 'కమ్మ' అను పేరు తాటియాకునుబట్టి వచ్చినదే. ఈ తాటాకులను స్త్రీలు కర్ణాభరణములుగాను, కంఠాభరణములుగాను (మంగళ సూత్రము), చేతులలోను జబ్బలలోను మంత్రాక్షరములు గల