పుట:Telugu merugulu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుగులు

9


వర్షోదకము నేలపై బడినప్పుడు మట్టితో గలసి వండు వాఱితేటదనము, తేలికదనము లేక కలుషమై, యస్వరసమై యుండునట్లు భాషకూడఁ దొలుత శబ్దరూపోచ్చారణాదులందుఁ దేటదనము, తేలికదనము, హృద్యత లేక క్లిష్టమై యుండును. కాలక్రమమున నా నీరు ఏళ్ళలోఁ గోళ్ళలోఁబడి నదులై ప్రవహించుచుఁ దేటవాఱి నడుమ నడుమ గుంటలలోఁ గోనేళ్ళలో నిలువరమంది ప్రసన్నమై రుచ్యమై యొప్పును, అట్లే భాషకూడఁ గాలక్రమమున సాధూచ్చార సంస్కారమంది, అందందు గ్రంధములందు నిబద్ధమై నిలువరమంది, స్వచ్ఛమై, యాస్వాద్యమై వెలయుచుండును వ్యవహార ప్రవాహమున భాష వడివడిగాఁ బరిణామ మందుచుండును గాని యది గ్రంధ నిబంధము నందిన పిదపఁ గొంత కట్టుదిట్టమును బడసి నిలుకడఁ జెందును. ఆవలఁ దత్పరిణామము పూర్వమంత త్వరగా సాగదు. ఆంధ్ర ద్రవిడకర్ణాటభాషల యారంభ మొక్కటి యేయైనను, సంస్కృత ప్రాకృతసంబంధ మల్పముగాఁ బడసి గ్రంధములందు నిబద్ధమై నిలువరమంది లక్షణ పరిష్కారములను బడయుటలో నటవము మొదటి దయినది. ఆ నిలువరముమీఁదను, ఆ లక్షణ పరిష్కారములమీఁదను నాంగక ఇంకను గొంతయుచ్చారవ్యవహారమునఁ బరిణామము బొందిపొంది సంస్కృత ప్రాకృతముల సాహాయ్యము నధికముగాఁ జెందిచెంది, పెంపొంది గ్రంధములందు నిబద్ధమైనది - కన్నడము. ఈ రెండింటి కింకను దర్వాత నీ రెండింటి లక్షణ పరిష్కారములతో నిల్వక యింకను నుచ్చారసంస్కార ములఁ బడసి, సవరనయి యందచందముల నంది సంస్కృత ప్రాకృతముల సరససాహాయ్యమున సభ్యుచ్ఛయముఁగాంచి గ్రంధములందు నిబద్ధమైనది తెలుఁగు. దక్షిణ హిందూదేశ సమష్టిదేశభాషా వధూటి పసిప్రాయపుఁబలుకు లజవము, ఎలప్రాయపుఁ బలుకులు కన్నడము; నెఱతనపుఁ బలుకులు