పుట:Telugu merugulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

3


పువ్వులను పుక్కిలించు కొప్పు, మణిమయమయిన యెడ్డాణము, రక్తహారము, తెల్లచీర ఇది తెలుఁగునెలఁత వేషము అని పై శ్లోకమున కర్థము. భర్తృమేణ్డాది సంస్కృత కవులు ఆంధ్రులనుగూర్చి చెప్పిన శ్లోకములకు ఆంధ్రస్త్రీలు సౌందర్యవతులని, నృత్యగానప్రియలనీ, అమాయికలని అర్ధసారము. ఆంధ్రల సంగీత సాహిత్యములతో తొలుత మహారాష్ట్ర కర్ణాటకుల కధిక సంబంధ ముండెడిది. సంగీతమున ఆంధ్రదేశి సంప్రదాయభేదములు కొన్ని మతంగుని బృహద్దేశిలో వివరింపఁబడినవి తెలుఁగువారిలో వివాహములందు మంగళసూత్రము కట్టుట అనాది యాచారము. ఈ యాచారము ఉత్తరదేశీయులకు లేదు. ఆర్యుల గృహ్యసూత్ర గ్రంధములలో లేనే లేదు. ప్రాచీనకాలముననుండి ఆంధ్ర స్త్రీలకు వివాహము లందు తాటీయాకును చుట్టగాఁ జుట్టి పసుపుపూసి నూలిబొందుతో కట్టి వధువు కంఠమున వరునిచే మూఁడుముళ్ళు వేయించుట యాచారము. కనుకనే దానికి తాళిబొట్టని పేరయ్యెను. తాళి యనఁగా తాడియే. అట్లే ఆంధ్రస్త్రీలు చెవులకు కమ్మలను, అనఁగా తాటియాకులనే చుట్టి పెట్టుకొనుట యాచారము. 'తాటాకు' పదమే సంస్కృతమున తాటంక మయినది. దానికి తెలుఁగున 'చెపొకు' అనికూడ పే రున్నది. తాటియాకులను చెవుల కమ్మ లని ధరించుట, తాళిబొట్టు కట్టుకొనుట తెలుగువారి నుండి కడమ ద్రావిడులకు సంక్రమించినవి. ఇట్లనుటకు తాళి, తాటంక, కమ్మ, చెవాకు పదములే సాధకములు. తాడికమ్మతాటాకులు తెలుఁగు పదములే కదా. తెలుఁగువారికి తాడిచెట్టు కల్పవృక్షము! తెలుఁగు వారిలో మాలలు, మాదీఁగలు, రెడ్లు, వెలమలు, కమ్మలు, కాపులు,కోమట్లు, రాచవారు, వెలనాట్లు, వేఁగిసాట్లు, తెలుగాణ్యులు, నియోగులు మొదలయిన యంతర్విభాగములు గల యష్టాదశ జాతుల ప్రజలలో సామాన్య ధర్మము లుగా నీ క్రిందివి కానవచ్చును.