పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

    భీమబలాఢ్యులు -పీన్గులైనిలిచిరి
            మధ్యపానముయొక్క - మహిమవలన !
   గౌరవార్హులు తామ - గౌరవపరులైరి
             మధ్యపానముయొక్క - మహిమవలన !

గీ|| ఎట్టిసుఖముల నేనియు - నీయలేని
     కల్లుద్రావుటమాని - సుఖంబులొంది
     యాయురారోగ్య భోగ భా - గ్యములతోడ
     భరతమాతను సేవించి - వరలుడయ్య||

దేవదాసు నాటకములో ప్రాణములు గోలుపోవుటకు మద్యపానమే కారణము గా నుండెను. సతి లీలావతి యను ప్రదర్శనములోకూడ మద్యపానమువలన వారనుభవించిన కష్టములు చెప్పనలవి గాకున్నవి. కనుక దేశక్షేమమునకై యిటువంటి ప్రదర్శనములను ప్రదర్శించువారికి మనమెంతయు కృతజ్ఞలము. మధువును ఇంత యమితముగా మన సహోదరులు త్రాగుటకు మన హిందూ దేశమందు ఈత, టెంకాయ, తాటిచెట్లు ఎక్కువగా పెరుగుటయే. ప్రధానమంత్రి గౌ|| సి. రాజగోపాలచారిగారు సేలం జిల్లాలో మధుపాన నిషేధ శాసనమును అమలుపఱచిరి.

మధుపాన నిషేధమునుగూర్చి బైబిలులో త్రాగుబోతులు పరలోక రాజ్యము నకు అర్హులు కానేరరనియున్నది. పంచంహాపాతకములలో నొకటిగా బేర్కొన్న నీమధ్యమును త్రాగకూడదని మనపెద్దలు వక్కాణించుచున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు మధుపాన నిషేధమును ఎటులైనను సాధింపబూనుకొని యుండుట వలన దేశము బాగుపడగలదని నమ్ముచున్నాను.