పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలహములకు కారణములేర్పడి సర్కారువారివద్ద గ్రుద్దులు, తన్నులు మొదలగు అవమానకరములగు శిక్షలకు పాలగుచున్నారు. అనేక విధములగు క్షయ, బుద్దిమాంద్యము మొదలగు రోగములతొ బలహీనులై జనులు చనిపోవుచున్నారు

మధుపాన దురభ్యాసము దురదృష్టవశమున ధనవంతుల యిండ్లలో ప్రస్తుత నాగరికతతొగూడి యెక్కువగా అలవడియున్నది. ఈపానము రక్తనాళములగుండా దేహమంతయు ప్రవహించి గుండె కొట్టుకొనుదానికంటె యెక్కువగా కొట్టుకొనుచుండుటచే మనుజు డేమిచేయుటకు దోపక యందరిని తన్నుచు తిట్టుచుండును.

కొందఱు బీదవారలైనను అప్పుచేసి మధువునుద్రావి, ద్రోహికి ఉపకారి యగపడినంత తాజేసిన పాపములెల్ల ప్రత్యక్షమగునట్లు ఋణదాతయగపడగనే తనయప్పు వడ్డితో కూడ కనుల గట్టినట్లుండుటవలన కొన్ని సమయములలో తాము ఆత్మహత్య చేసికొనుటయేకాక ఋణదాతలను చంపుటకుకూడ ప్రయత్నింతురు. కాబట్టి మధుపాన మెంత కఠిన దుష్టకార్యములకైనను దారి తీయుచున్నది. కొందఱు బీదవారు తాము సంపాదించు డబ్బంతయు మధుపాన మునకు వెచ్చించి యింటిలో నుండివారిని పస్తువేయుచుందురు. కొంతమంది జనులు కుటుంబములతో గూడ త్రాగి యప్పులపాలై నిలువనీడకు యల్లాడు చున్నారు.

పొగాకుతో చేయబడు వస్తువులన్నింటిలో నూటికి నూరుపాళ్లు విషమున్న దని యొక శాస్త్రజ్ఞడు వ్రాసియున్నాడు. చుట్టలు త్రాగుటవలన చూపుకనబడదని మనవారికి తెలిసియు దానిని మానరు. ఒక కవి మధ్యపానము చేయువారిని వర్ణించుచు ఇట్లు వ్రాయుచున్నాడు.

       సీ|| లక్షాధిపతులెల్ల - భిక్షాధిపతులైరి
                  మధ్యపానముయొక్క - మహిమవలన!
             సుజ్ఞానపరులెల్ల - రజ్ఞానపరులైరి
                  మధ్యపానముయొక్క - మహిమవలన !