పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/813

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేరు పొందింది. ఝోరియా అంటే కొయ్య కఱ్ఱలు పట్టుకుని వలయాకారంగా ఏర్పడి కఱ్ఱలు కొడుతూ లయబద్ధంగా నృత్యాలు చేస్తారు. ఈ నృత్యం ఎంతో ఆకర్షణీయంగానూ, ఉత్తేజ కరంగానూ వుంటుందంటారు సంపత్ కుమార్. అలాగే దేవీ నవరాత్రి సమయాలలో "గర్భా" నృత్యం చేస్తారు. రాజపుత్ర స్త్రీలు పాటలు పాడుతూ చేసే "మౌహులో" , "ఫండారో" నృత్యాలు సాంప్రదాయ నృత్యాలుగా వర్థిల్లాయి. ముఖ్యంగా ఈ నృత్యాలను వివాహ సందర్భాలలో చేస్తారు.

తర్ తల్వార్ కత్తి సాము నృత్యాన్నీ , డోలు నృత్యాన్నీ హోలీ పండుగలో గీర్ నృత్యాలను పురుషులు అత్యద్భుతంగా చేస్తారు.

అంతే కాక అజ్మీరులోని "సస్సేల" జానపద నృత్యాలనూ మౌంటు అబూ లోయలో గిరిజనులు చేసే గరాసియాలనూ, 'ఖయాల్ ' అనబడే నృత్య నాటకాలను రాజస్థాన్ ప్రభుత్వం గుర్తించి వాటిని పోషిస్తూ వుంది. భవాయి అనే కులంవారు అయిదు వందల సంవత్సరాలుగా ఈ నృత్య నాటకాలను ప్రదర్శిస్తూ వున్నారు. వారి జీవితాలను అందుకే అంకితం చేసి ఆ కళారూపం ద్వారానే జీవిస్తున్నారు.

రాజస్థాన్ జానపద నృత్యాలకు పేరెక్కిన గన్న రాష్ట్రం. నెత్తిమీద బిందెలు పెట్టుకుని ఆడే "తేరాతావీ" నృత్యమూ, వెదురు కఱ్ఱలతో తయారు చేసిన గుఱ్ఱాన్ని భుజాలకు తగిలించుకుని ఆడే "కుచ్చిఘోరి నృత్యం" పూజా సందర్భాలలో ఆడే గౌరి నృత్యం ప్రశంసించ తగ్గవి.

అస్సాం:

ఎక్కడో ఈశాన్య సరిహద్దు రాష్ట్రమైన సౌరాష్ట్రంలో నాగ నృత్యాలు ఎంతో పేరు పొందాయి. ఋతువులకు సంబంధించిన "వైశాఖి నృత్యం", "బిహు నృత్యం" . "ఖాశీ నృత్యం". పగలంతా కష్ట పడి సాయం సమయంలో చేసే బగురుంబ నృత్యాలు, పంటల సమయంలో "మెయ్ గెనెయ్" నృత్యాలు లూషై కొండల్లోనూ, బ్రహ్మ పుత్ర లోయలలో చేసే వెదురుగడల నృత్యం, మిజో జాతి గిరిజనులు చేసే "భౌల్ల నృత్యం" , "గారో నృత్యం" , "మిరిహుషారీ నృత్యం" బోడో జాతి వారి యుద్ధ నృత్యాలు, జైత్య జాతి వారి "లాహా" అనబడే మత సంబంధమైన నృత్యాలు, నాగా జాతి వారి త్రిశూల నృత్యాలు, కోడి పుంజుల పోట్లాట నృత్యాలూ, యుద్ధ నృత్యాలూ ఎంతో ప్రఖ్యాతి వహించాయి.