పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/773

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యంగా నాయికా పాత్రలను అభినయించటంలో సుప్రసిద్ధుడు. అప్పుడప్పుడు శ్రీ కృష్ణ పాత్రనూ, సూత్రధారుని పాత్రనూ అవసరాన్ని బట్తి నటిస్తారు.

ముఖ్యంగా ద్రౌపదిపాత్ర పోషణలో ఎన్నోచోట్ల ప్రశంసలందుకోవడమే కాక ఘన బహుమతుల్ని కూడ అండుకున్నారు. అంతేకాక, హార్మోనియం వాయించడంలోనూ, మృదంగ వాయిద్యంలోను నిపుణులు.

సేదా పెద్దబ్బయ్య ఉద్దాత్తమైన పురుష పాత్రలను ధరిస్తారు. అవసరాన్ని బట్టి సుధేష్ణలాంటి స్త్రీ పాత్రలను కూడా ధరిస్తారు.

జి.మునిరత్నం ధీరోదాత్త పాత్రలను ప్రదర్శించడంలో ప్రసిద్ధుడు. హరి కథలను చెప్పడం లోనూ, సంగీతంలోనూ, హార్మోనియం, ఫిడేలు లాంటి వాయిద్యాలను వాయించడంలోనూ నిపుణులు.

మాస్టరు జి.యం. భాగవతులు హార్మోనియం వాయించడంలో ప్రసిద్ధుడు. ఎంతో మందికి హర్మోనియం వాయిద్యాన్ని నేర్పారు. హరి కథలు చెప్పడంలో నేర్పరి. పాత్రలను పాత్రోచితంగా నటించగల సమర్థుడు. సంగీత సాహిత్యాలలో మంచి అభినివేశం కలవారు.

ఏబై సంవత్సరాల వయసు గల కోమటి రామ చంద్రయ్య సంగీత సాహిత్యాలలోనూ పాత్రోచిత నటనలోనూ అనుభవజ్ఞుడైన నటుడు.

ఇంకా డి. రామకృష్ణయ్య అన్ని రకాల పురుష పాత్రలనూ సమర్థవంతంగా పోషిస్తున్నారు.

టి.ఎన్. లోక నాథం విభిన్న మనస్తత్వాలు గల స్త్రీ పురుష పాత్రలను ధరించటంలోనూ, సూత్ర ధారి పాత్రను నిర్వహించడంలోనూ సమర్థుడు.

ఎస్.ఎం. శేషప్ప వివిధ స్త్రీ పురుష పాత్రలను సమర్థవంతంగా నటించడమే కాక, గంభీరమైన కంఠస్వరం గల నటుడు.

సి.ఎస్. రంగ స్వామి స్త్రీ పురుష పాత్రలను ధరించడంలో మేటి. వి.ముని వెంకటప్ప స్త్రీ పాత్రల్నీ, హాస్య పాత్రల్నీ చక్కగా పోషిస్తాడు.