పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/768

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లంటారు. వీరి దీపపు సెమ్మాని గరుడ స్తంభం అంటారు. కొందరిని శంకు దాసర్లనీ, కొందరిని గరుడ స్తంభం దాసరులనీ పిలుస్తారు. వీరు గాథలను గానం చేస్తారు.


ఒడ్డెవారు

ఒడ్డె వారంటే గ్రామాల్లో చెరువుల్నీ, నూతుల్నీ, కాలువల్నీ త్రవ్వేవారు. ఎక్కడ ఆ పనులుంటే అక్కడకు వెళుతూ సంచారము చేస్తారు. కష్టజీవులు, పనిలో నిమగ్న మైనప్పుడు కష్టాన్ని మరిచిపోవడానికి పదాలు పాడుతూ వుంటారు. వాటినే వడ్డె వుప్పర పదాలంటారు. వడ్డే వారికే మరో పేరు వుప్పర, వీరి వెంటే ఎల్లమ్మ దేవత విగ్రహాన్ని తీసుకుపోతూ వుంటారు. ప్రతి సంవత్సరమూ జాతర చేస్తారు. వారి కులంలో వారే పూజారిగా వుంటారు. జాతర సమయంలో అటలాతో పాటలతో చిందులు వేస్తారు. వడ్డెవారు పచ్చబొట్లు పొడుస్తారు.


పాండవులవారు

మాహాభారతగాథను అద్భుతంగా గానం చేస్తూ జీవించే ఒక తెగ హైదరాబాదు ప్రాంతంలో వుంది. ఈ తెగలోని పురుషు లందరూ పాండవుల గాథను అత్యద్భుతంగా గానం చేస్తారు. పాండవుల గాధను గానం చేయడం వల్ల వీరిని పాండవులవారని పిలుస్తూ వుంటారు. మహాభారత గాథలను మినహా మరే గాధలను గానం చేయరు. పురుషులు గానం చేస్తే వీరి స్త్రీలు పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు పచ్చ బొట్లు పొడిచి డబ్బును సంపాదిస్తారు. వీరు ఒక్క తెలంగాణాలో తప్పా ఇతర ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించరు.


ఇంకెన్నో కళారూపాలు

పైన ఉదహరించినవే కాక ఇంకెన్నో కళా రూపాలున్నాయి. వాటిలో కొన్ని కనుమరుగై పోయాయి. మరికొన్ని ఆలనా పాలనా లేకుండా కొనవూపిరితో కొట్టు కున్నాయి. వాటిలో కొన్నింటిని ఈ క్రింద ఉదహరిస్తున్నాను.