పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/737

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇలా ఒకటా రెండా? ఎన్నో అద్భుతాలను రాజు గారు ప్రదర్శించారు. ఆ కొంచెం సేపూ ఆయన అపర అర్జునుడులాగే అందరికీ కనిపించాడు. బాణాన్ని సంధించే ప్రతి సారీ, ఏమౌతుందో నన్నంతగ భయభ్రాంతులయ్యే విధంగా ప్రదర్శనం సాగిపోయింది.

వీరే రాజు గారు:

రాజుగారు ఆజానబాహువు. నెరసిన గిరిజాల జుట్టు, మెలికలు తిరిగిన బుగ్గ మీసాలు. గ్లాస్కో పంచెను సైకిల్ కట్టు, నిపుణత్వంతో కూడుకున్న దృడదీక్ష, కొట్ట వచ్చినట్లు కనిపించాయి.

విలు విద్య ఆషామాషా విషయం కాదు. ఎంతో సాధన, పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్ర లక్ష్యం వుంటే గాని ఈ విద్యను సాధించడం కష్టం. అలా కష్టపడి ఎందరో ఈ విద్యను సాధించారు. ప్రదర్శించారు. ప్రజల మన్నన లందుకున్నారు.

ఆదరణ లేని అద్భుత విద్య:

ప్రావీణ్యంతో కూడు కున్న ఈ విలువిద్యకు ఈనాడు ఏ ఆదరణా లేదు. జీవన భృతి కోసం, వుత్సవాలలోనూ, సభా సందర్భాలలోనూ ప్రదర్శిస్తున్నారు. యుగ యుగాలుగా, తర తరాలుగా ప్రజా జీవితంలో భాగమై పోయి అది ఒక మహోజ్వల కళారూపంగా అభివృద్ధి చెంది, అశేష ప్రజా సామాన్యాన్ని అలంరించిన నాటి విలువిద్యను ఒక కళారూపంగా ఆభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతో వుంది.

ఈనాడు జీవించి వున్న వృద్ధ కళాకారుల వద్ద వున్న విద్యను వీడియో తీయడం, వారిని ఆహ్వానించి ఆదరించటం, వృద్ధాప్యంలో వున్న వారికి ఫన్ షన్ లు ఇవ్వడం, ఆ కళాకారులను కాపాడు కోవటం జరగాలి.