Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/705

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొమ్మాయిదాసుడే,కొమ్మదాసరి

673


కొమ్మ దాసరులు చెట్టుకొమ్మమీదే కూర్చుని యాచిస్తారు. వారు అందరి మాదిరి ఇంటింటికి తిరిగి యాచించరు. చెట్టు దిగిన తరువాత ఎవరు ఏమిచ్చినా పుచ్చుకోరట. అది వారి కుల కట్టుబాటు. ఆ కట్టుబాటును విస్మరిస్తే కులంలో వెలివేస్తారట. అంటే యాచనలో కూడ ఎంత దర్జాగా యాచిస్తారో దీనిని బట్టి అలోచించవచ్చు.

ఒకరకంగా కొమ్మ దాసరులు ఎంత నీతిగా జీవించారో ఈ క్రింది ఉదాహరణ గూర్చి తెలుసు కోవచ్చును. కొమ్మ దాసరులు ఒక వూరిలో ఒకేసారి యాచిస్తారు. వ్యాచించిన వూరికి మళ్ళీ తిరిగిరారు... ఒక వేళ వచ్చినా ఎంతో కాలానికి గానీ తిరిగి రారు. వీరి తెగ చాల చిన్నదవటం వల్ల రాను రాను వారి జాతీ, జాతితో పాటు వారి కళారూపమూ క్షీణించి పోయింది.

కొమ్మ దాసరి చెట్టేక్కే ముందే ఆ చెట్టుక్రింద ఒక గుడ్డ పరుస్తాడు. ఆ తరువాత చెట్టెక్కి బిగ్గరగా గణగణమంటూ గంటను వాయిస్తాడు. ఈ గంట వాయిద్యంతో పూరిలో వున్న చిన్న పెద్దా అందరూ ఆ చెట్టు క్రిందికి చేరుతారు. అప్పుడు కొమ్మ దాసరి పాటలు ప్రారంభిస్తాడు. ప్రగల్భాలు సాగిస్తాడు. విమర్శిస్తాడు దూకి చస్తానని బెదిరిస్తాడు. ఎత్తు మీద కూర్చుని చుట్టు ప్రక్కల ఇళ్ళల్లో పని చేసుకునే స్త్రీలనూ, వారు ధరించిన నగలనూ, కట్టుకున్న చీరలనూ, పనులనూ రకరకాలుగా వర్ణిస్తూ వాళ్ళను రెచ్చ గొడతాడు. ఉదాహరణకు రక రకాల రంగుల చీరలు కట్టుకున్న స్త్రీలను వర్ణిస్తూ ఈ విధంగా సంబోధిస్తాడు.

నాగుల చీర గట్టిన నాగమ్మక్కో
తెల్లచీర గట్టిన పల్లాలమ్మో
చెంగావిచీర గట్టిన చుక్కమ్మక్కో
వంకాయరంగు కోక కట్టిన వరదమ్మక్కో
నీలిచీర గట్టిన నీలమ్మక్కో
దొండపండు చీర గట్టిన బంగారమ్మో

అంటూ పేర్లు వారివి కాక పోయినా, ఆ రంగుల చీర్లను కట్టుకున్న వాళ్లను వయనంగా వర్ణిస్తాడు. అలాగే చుట్టు ప్రక్కల ఇళ్ళల్లో పనులు చేసుకునే స్త్రీలను ఈ విధంగా వర్ణిస్తాడు.