Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/704

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొమ్మాయి దాసుడే, కొమ్మదాసరి

మనం మన సంస్కృతిలో ఇప్పటికే విలువైన కళలనూ, సాంప్రదాయాలను పోగొట్టుకున్నాం. అలా మన ప్రాచీన సంస్కృతిని పోగొట్టుకుంటూ వచ్చాం. కాలక్రమంలో వాటిని పోషించే దిక్కు లేక అంతరించిపోయాయి. అలాంటి వాటిలో_

కడియాల కామమ్మక్కో - ముక్కు పుడకల చుక్కమ్మక్కో
కాసుల పేరుల కనకమ్మక్కో - గజ్జెల వీరమ్మక్కో
చేమంతిపూల సీతమ్మక్కో - చింతపూల రవికె చిలకమ్మక్కో
ముక్కు పుడకల చిలకమ్మక్కో - కొప్పుగొలుసుల కోటమ్మక్కో
బాజీబందుల బంగారమ్మో - దండ కడియాల కొండమ్మో
ముంతకొప్పుల కాంతమ్మో - ముత్యాలనత్తున్న ముత్యాలమ్మక్కో

అంటూ చెట్టు కొమ్మ మీద కూర్చుని, కొమ్మాయిదాసుడు పాడే, కొమ్మ దాసరి కళారూపం. ఈ తరం వారికి ఎవ్వరికీ తెలియదు. అంతరించిపోయిన జానపద కళారూపాలలో ఇదొకటి.

అయితే కొమ్మాయిదాసుడు అనే పేరు మాత్రం ఈ నాటికి ప్రచారంలో వుంది. సమాజంలో మామూలుగా వుండే వేషధారణకాక, విలక్షణ వేషధారణలో కనిపించే వ్వక్తిని ఏరా కొమ్మాయి దాసుడులా తయారయ్యావే అనే నానుడి ప్రచారంలో వుంది. కొమ్మ దాసరి పేరే కొమ్మాయి దాసుడుగా మారిపోయి వుండవచ్చు. కొమ్మ దాసరంటే కొమ్మమీద కూర్చుని ప్రసంగాలు చేసేవాడు. కొమ్మంటే కొమ్మే కాదనీ, ఎత్తైన చెట్టుగానీ, గుడిగాని, ఎత్తైన గోడగానీ, చివరికి బజారులో వుండే బండి గాని ఎక్కి కూర్చుని వినోదం చేకూరుస్తూ దానాన్ని పరిగ్రహించే వాడని, కె.వి. హనుమంత రావు గారు ఆంధ్రప్రభలో వివరించారు. ఒక రకంగా కొమ్మ దాసరి కళా రూపాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. వారికి కృతజ్ఞతలు.