పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/701

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మన ఇరుగు పొరుగున వున్న కన్నడ రాష్ట్రంలో కూడ పిచ్చుకుంటుల వారున్నారు. వారంతా కూడా శ్రీశైల మల్లిఖార్జున భక్తులే. వీరిలో దావన కుంట్లు, ఎద్దుకుంట్లు, గంట కుంట్లు మొదలైన తెగల వారున్నారు. పిచ్చు కుంటుల వారి వేష ధారణ కథకునికి హుందాయైన తలపాగా, ఒక చేతిలో కత్తి, మరొక చేతిలో డాలూ, కాళ్ళకు గజ్జెలూ వుంటాయి. ఈయన చరణాన్ని పాడుతూ వుంటే, మిగిలిన వారిద్దరూ దీర్తం తీస్తూ కథకుని గొంతుతో గొంతు కలుపుతారు. ఇక మూడవ వ్వక్తి ఒక తోలుతిత్తిని చంకకు తగిలించుకొని గుక్క విడువని శృతి పోస్తూ వుంటాడు. ఈ శృతి చెవులకు ఎంతో ఇంపుగా వుంటుంది. ఈ శృతిని ఆధారం చేసుకుని పిచ్చు కుంటుల కథా విధానాన్ని నడుపుతూ వుంటారు.

కథలో వచ్చే ఆయా పాత్రల మనస్తత్వాల ననుసరించి కథకుడూ, వంత దారుడూ, ఆ పాత్రల్లోకి మారి పోతారు. పిచ్చుకుంటుల కథా విధానం ఎలా వుంటుందో పల్నాటి యుద్ధంలో బాలచంద్రుడు యుద్ధంలో దూకిన ఘట్టాన్ని వింటే బోధ పడుతుంది.

రగడ

కుప్పించి ఎగసిన - కుండలంబుల కాంతి
గగనభాగంబెల్ల - గప్పి కొనంగ
కంపించి జగమంత - కదలి వణకంగ
మొగమందు చిరునవ్వు - మోసులెత్తంగ
కొండలంతా రాళ్ళు - పిండి పిండిగను
పత్రమంతా రాళ్ళు - పొడి పొడిగాను
శనగలంతారాళ్ళు - చిచ్చవ్వగాను.

ఒక్క దూకు దూకాడయ్యా - శీలం వారి బాలుడు, శ్రీ మలమల దేవ చెన్నుడో - ఓ.ఓ.ఓ. అంటూ దీర్ఘంతీస్తూ పాడతారు.

ఈ విధంగా పిచ్చు కుంటుల వారు ఎంతో ఉత్తేజంగా ఖడ్గ తిక్కన, కాటమరాజు, పలనాటివీర చరిత్ర మొదలైన కథలను చెప్పేవారు.