పిచ్చుకుంటుల వారందరూ భిక్షమెత్తే వారుగా గానీ, అంగవైకల్యం కలవారుగా గానీ ఉండి వుండక పోవచ్చు. ఆనాడు సోమనాథుని శ్రీశైల యాత్రలో ఆపై నుదహరించిన అంగ వైకల్యం కలవారు కనిపించి వుండవచ్చును.
- మూర్తీ భవించిన శైవం:
పిచ్చుకుంటుల వారందరూ మూర్తీ భవించిన వీర శైవ మతాన్ని ఆరాధించారు. విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా వీరు శక్తి ఉపాసనాపరులు. రేణుకా మహాత్మ్యాన్ని, పోచమ్మ, ఎల్లమ్మ, మరిడమ్మ, మూహూరమ్మ కథలను ప్రచారం చేయడమేకాక వారు నమ్మిన దేవతల్ల కొలువులు కొలుస్తారు. వీరికి మూలదైవం శ్రీశైల మల్లిఖార్జునుడే.
- పిచ్చుకుంటుల పేరెందుకు వచ్చింది:
అక్కడక్కడా ఈనాడు మనకు కనిపించే పిచ్చుకుంటుల వారిని గురించి అసలు మీ పుట్టు పూర్వోత్తరా లేమిటో అని ప్రశ్నిస్తే , వారీ విధంగా ఒక గాథను వివరిస్తారు. త్రిమూర్తుల వివాహ సందర్బంలో వారి వారి గోత్రాలు వల్లించటానికి మూడు మట్టి బొమ్మల్ని చేసి వాటికి ప్రాణం పోశారనీ, అలా బొమ్మల నిర్మాణంలో ఒక బొమ్మ కాలు కుంటిగా వుండటం వల్ల అతని సంతాన మంతా భిక్షమెత్తే కుంటి వాళ్ళయ్యారనీ, చెపుతూ, మరో కథను కూడ చెపుతారు. ఏడుగురు యాదవ కాంతలు సంతానం కోసం భక్తి శ్రద్ధల్తో శివుని గూర్చి తపస్సు చేశారనీ వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక కుంటి బాలును పెంచమని వరమిచ్చాడనీ, ఆ తరువాత వారంత గర్భధారులై ఏడుగురు ఆడ పిల్లల్ని కన్నారనీ, ఆ ఏడుగురు పిల్లల్నీ పెద్ద చేసి ఒక కుంటి వాడి కిచ్చి శివుడు పెళ్ళి చేయమన్నాడనీ, ఆ ప్రకారం వారు చేసారనీ, ఆ తరువాత శివుడు అతనికి ఒక శంఖాన్నీ, గంటనూ, ఒక శూలాన్నీ, ఒక ఎద్దునూ ఇచ్చి భిక్షాటన చేసి జీవించ మన్నాడనీ, అతని సంతానమే భిక్షక కుంటులనీ, పిచ్చు కుంటుల వారు చెపుతారు.
- చంద్ర శేఖరుని వర్ణన:
పిచ్చుకుంటుల వారిని గురించి చంద్ర శేఖరుడు తన శతకంలో ఈ విధంగా వర్ణించాడు.