పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/698

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంటింటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటులవారు

ఆంధ్రదేశంలో చిరకాలం నుండీ ప్రచారంలో వున్న కళారూపం పిచ్చుకుంటుల కథ. ఈ కథ, పిచ్చుకుంటులవాళ్లనే జాతి వారు చెపుతూ వుంటారు. ఈ నాటికీ వారు వెనుక బడ్డ ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను వర్ణిస్తూ గోత్రాలను చెపుతారు.

వీరు చెప్పే కథల్లో ప్రాముఖ్యమైనదీ, చారిత్రాత్మకమైనదీ, వీరోచితమైనదీ శ్రీనాథ మహాకవి రచించిన "పల్నాటి వీరచరిత్ర". ఈ కథను ప్రారంభిస్తే దాదాపు పదిహేను రాత్రులు చెపుతారు.

పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశముంది. ఒకప్పుడు వీరు కేవలం ప్రజలను యాచించే వారని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.

పండితారాధ్య చరిత్రలో:

వీవంగ చేతులు లేవయ్య - నడచి
పోవంగ కాళ్ళును లేవయ్య - అంధ
కులమయ్య పిచ్చుకుంటుల మయ్య
దాన మొసగరే ధర్మాత్ములార.

అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు అంగవైకల్యం కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, 'దాన మొసగరే ధర్మాత్ములార ' ఆనడాన్ని బట్టి వారు యాచకులని అర్థమౌతూ వుంది. ఆనాడు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ వుండి.

వీరిని సర్కారాంధ్ర దేశంలో పిచ్చిగుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు.