పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగమునకు విచ్చేసిసిన అమాత్యులెవరండీ? అని ప్రశ్నిస్తే వెంటనే లోపల వున్న పాత్ర ధారి ఏ వుద్దేశ్యంతో ప్రవేశించనున్నాడో అంతా పూసగ్రుచ్చినట్లుగా పాత్ర పరిచయం చేసేవారు. ఆ తరువాత నాటక ప్రారంభం. నటుడు వల్లించిన ప్రతి పాటకూ హంగుదార్లు వంత పాడుతూ నానా హంగామా చేస్తారు. ఈ విధంగా నాటకాన్ని రక్తికి తీసుకువస్తారు. ఈ విధమైన బయలు నాటకాలు రాయలసీమలో అన్ని పల్లె ప్రాంతాల్లోనూ ప్రదర్శింపబడుతూ వుండేవి.

వెదురు చాపల వీథినాటక రంగస్థలం:

ఆనాడు రాయలసీమలో నాటకాలు ప్రదర్శించటానికి తగిన ప్రదర్శన శాలలు లేవు. వెదురు చాపలు, తడికెలూ, గోనె సంచుల కప్పులతో నాటక శాలలు నిర్మించేవారు. ప్రతి నాటక సమాజమూ మంచి క్రమశిక్షణతో రంగస్థలాన్ని పవిత్రంగా ఎంచేవారు. నాటకాలలో వాయిద్యాలుగా హర్మోనియం, తబలా, మృదంగం, ఫిడేలు ఉపయోగించేవారు. వేష ధారణలో సఫేదు, అర్థళం వుపయోగించేవారు. ఉత్తమ పాత్రలన్నిటికీ విలువైన చెంకీ కోటులను, మంచి తలపాగాలను తురాయిలనూ ఉపయోగించేవారు. విగ్గులకు బదులుగా వారి వారి శిరోజాలనే విగ్గులుగా పెంచుకునేవారు.

బళ్ళారికి పేరు తెచ్చిన బయలాటలు:

పూర్వం నుంచీ బళ్ళారి ప్రాంతంలో బయలాట అనే జానపద కళారూపం బహుళ ప్రచారంలో వుండేది. ఆంధ్రప్రదేశపు వీధి నాటక ప్రదర్శనానికి, ఈ బయలాట ప్రదర్శనానికి ఎంతో సన్నిహిత సంబంధముంది. ఈ నాటికీ ఈ కళారూపం బళ్ళారి చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రదర్శింప బడుతూ వుంది.

ఒకప్పుడు బళ్ళారిలో "జనల్ ఘాట్" , "మేఘాట్" అనే రెండు పెద్ద

బయలాట కంపెనీలను 'గరుడచేడు హనుమంతప్ప','సామసాగరం వెంకణ్ణ' కురుగోడు దొడ్దకవి మొదలైన వారు నడుపుతూ వుండేవారు. వీరు కన్నడిగులు.