Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/682

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొర కుడి భుజాన వెంకటేశ్వరుడు సాయమైతడు. దొర పట్టిందల్లా బంగారమైతది. చెయ్యదలచినపని చేకూర్తది. అయ్యగారి కుడి కంట్లో పుట్టు మచ్చున్నది. దాని ఇసేసమేమంటే? అయ్య కొద్దిలోపల నాల్గుకాళ్ళ తెల్పు, నడినెత్తిన సుక్క గల పంచ కళ్యాణి గుర్రాన్ని ఎక్కేపోతుండండి. అయ్యకు నొసట లక్ష్మీ రేఖుండది. ఈపున ఇంజామర, అరికాలున తామర పద్మం వుండె. అయ్యగారు తెల్ల ఏనుగు ఎక్కి భూ పరిపాలన చేసేవంతుండది.

దొరా, ఓ దొరా! మాదొరా, మా దొడ్డ దొరా! త్యాగాల దొరా, భోగాల దొరా అంటూ అయ్యగారిని ఈ విధంగా ఊదరగొడతాడు.

అద్గదిగో దొరా, మీమీద కీడు తలపెట్టిన వారిని వెను వెంట పసిగట్టి వాడి పళ్ళన్నీ పీకించి ఒక్కంత మండించి, మరి తగల బెట్టేసి, భస్మంబు చేసేసి అయ్యగారి కిచ్చే భారం ఈ రామ జోగిదే దొరా... తమ కీర్తి ఇంద్రుని కన్న గొప్పది. చంద్రుని కన్న గొప్పది. మీకు మీరే సాటి అంటూ__

రామ జోగి దేవెనలు:

ముత్యాల మూతలే - మీ యింట మూల్గాలె
రతనాల రాసులే - మీ చెంత జేరాలె
వరహాల బేరాలే - మీ రెపుడు సేయాలె
మా వూరి పేరయ్య కూచిపూడిర అయ్య
వినరయ్య కనరయ్య రామజోగిర అయ్య
బుడబుక్కల రామజోగిరా ఓ రయ్య
మా పగటి వేషాలె మీరెపుడు సూడాలె
మీ మంచి శాలువలు మా మెడకు కప్పాలె
 మీ చేతి కంకణమె, మా చేత మెరవాలె
మహారాజ రాజ మార్థాండ తేజా
శుభోజ్జయం శుభోజ్జయం
మీకు జయం మాకు ధనం.

అంటూ డబ్బులు దండుకుంటారు. ఈ నాటికీ పగటి వేషధారులు బుడబుక్కల వేషాలను అక్కడక్కడ ధరిస్తూనే వున్నారు. అయితే వాటికి అంతగా ఆదరణ లేదు.