పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/643

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందర్నీ ఆకట్టుకున్న బుట్టబొమ్మలు


ఈ తరం వారికి బుట్ట బొమ్మలను గురించి అంతగా తెలియక పోయినా ఆ నాటి తెలుగు ప్రజల్లో బుట్ట బొమ్మలను గురించి తెలియని వారెవరూ వుండరని చెప్పుకోవడం అతిశయోక్తి కాదు.

బుట్ట బొమ్మలు, పెళ్ళి వూరేగింపులలోనూ దేవుని కళ్యాణ వుత్సవ సమయాల్లోనూ, పెద్ద పెద్ద తిరుణాళ్ళలోనూ, జాతర్లలోనూ ప్రదర్శింపబడుతూ వుండేవి.

బుట్ట బొమ్మలు ప్రజా సమూహాల మధ్య ఎత్తుగా వుండి అందరికీ కనిపించే తీరులో అందర్నీ ఆకర్షిస్తూ వుంటాయి.

ఇతర కళారూప ప్రదర్శనాలకు ప్రజలు ఎలా ఆకర్షితులౌతారో, ఈ బుట్త బొమ్మల ప్రదర్శనాన్ని కూడ వింతగా చూస్తారు.

ఈ బొమ్మలు ఎవరితోనూ మాట్లాడవు. ప్రజల మధ్య తిరుగుతూ వినోదపరుస్తాయి.

బొమ్మల శృంగారం:

ఈ బొమ్మల్ని పురుషులే ఆడిస్తారు. ఈ బొమ్మల్లో భార్యా భర్తలు, వారి ప్రేమ కలాపాలు, వారి ప్రేమను భగ్నం చేసే దుష్ట పాత్ర, స్త్రీ బొమ్మతో కామ కేళీ విలాసాలు. ఇది చూచిన భర్త బొమ్మ వెంటబడి దుష్టపాత్రధారిని తరమడం తరువాత భార్యవెంట పడటం, స్త్రీ పాత్ర క్షమించమని వేడుకోవటం, ఇలా బొమ్మల ప్రదర్శనం జరుగుతుంది. ఈ ప్రదర్శనానికి కూడ డప్పుల వాయిద్యముంటుండి. బొమ్మను ధరించిన పాత్రధారి కాళ్ళకు గజ్జెలు కట్టుకునే అడుగులు వేస్తాడు.

అలాగే ఈ బుట్ట బొమ్మల్లో పాముల వాడి బొమ్మ ఉంటుంది. నాగస్వరం ఊదుతూ, నృత్యంచేస్తూ వుంటుంది. ఒక్కొక్క సారి ఈ బొమ్మలు నాలుగైదు కూడా వుంటాయి...వీటిలో శింగి, సింగడు లాంటి హాస్య పాత్రలు కూడా వుంటాయి.

ఈ బొమ్మలు అతి సహజంగా జీవకళ వుట్టి పడేలా రంగు రంగులలో చిత్రించబడి వుంటాయి.