దాయాన్నే వారు నైజాం సంస్థానంలో ప్రచారం చేశారు. కాని రాను రాను వారి కళా సాంప్రదాయం నిర్జీవమైపోయింది.
వీరు కూడ ఆ గ్రామంలో వున్న కాళత్తయ్య దేవాలయంలో బిడ్డలందరికీ చిన్నతనంలోనే ముక్కులూ, చెవులూ కుట్టించి, గజ్జె కట్టించి నాట్యాభ్యాసానికి ప్రారంభోత్సవం చేసేవారట. అక్కడ వున్న కళాకారులు చల్ల మోహన కృష్ణ, చల్లా కాళత్తయ్య, చల్ల ముద్దు కృష్ణ మొదలైన వారు వీధి భాగవతాలను ప్రచారం చేశారు.
- చల్లావారు:
సిద్ధేంద్రయోగి పేరు నిలబెట్టిన వారు చల్లావారు. ఈ మధ్య కీర్తిశేషులైన భరత శాస్త్రం లక్ష్మీనారాయణశాస్త్రి, వారిలో తొమ్మిదవ తరానికి చెందినవారు. శాస్త్రి గారు ఆ కళాకారుల కుటుంబానికి చెందిన సుప్రసిద్ధ నాట్య కళావిశారదులు. భామా కలాపాన్ని, గొల్ల కలాపాన్నీ క్షేత్రయ్య పదాలనూ, తరంగాలగానూ అభినయించడంలో దిట్ట. నృత్య విద్యల్లోనే గాక, సంస్కృతాంధ్ర భాషలలో చక్కని పాండితీ ప్రతిభ గడించారు. నృత్యరీతిలో వీరి బాణీకీ, కూచిపూడి వారి బాణీకీ అడుగుల క్రమంలోనూ, జాతి విన్యాసాల్లోనూ తేడా వున్నట్లు ఆంధ్ద్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారిచేత జరుపబడిన కూచిపూడి నాట్య సదస్సులో వివరించారు. వీరి కలాపంలో కొన్ని భాగాలను ఆనాడు అఖిల భారత సంగీత నాటక అకాడమీ వారు టేపు రికార్డు చేశారు. వారి సాంప్రదాయం ఎటువంటిదో మనకు తెలియకుండా పోయింది.
కోటకొండలో ఈ నాటికీ వున్న లక్ష్మీనారాయణ శాస్త్రి గారి అన్న
కుమారుడైన రంగయ్య గారికి భరత నాట్య శాస్త్రంలో అభినివేశం అట్లాగే వున్నదట. మరికొందరున్నా జీవనోపాధి కష్టమై ఇతర వృత్తుల లోనూ, వ్వవసాయంలోనూ ఆసక్తిని పెంచు కున్నారు.