పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఇటీవల మార్పు;

మామూలుగా ఈ తూర్పు బాణీలో వున్న ప్రత్యేకత ఏమంటే ఒకే రాగంలో దరువు ప్రారంబించి, గతులనూ, సంగతులనూ మారుస్తూ గంటల తరబడి గానం చేస్తారు.

ఇంతకు ముందు అటా పాటా సమపాళ్ళలో నడిపించినా, ఇటీవల కాలంలో, భామా పాత్రాభినయానికి ప్రాముఖ్యం పెరగటం వల్ల, ఆటకు సంబంధించిన నృత్యాభినయం తగ్గి పోయి పాటకు ప్రాముఖ్యం పెరిగిందంటారు. భామ పాత్రధారి ఎంత గొప్పగా గానం చేస్తే, అంత గొప్పగా ప్రజలు ఆదరిస్తారట. ఆయననను గొప్ప కళాకారుడుగా గుర్తిస్తారట. అందువల్ల భాగవతాల్లో కళాకారుడు దీర్ఘగానాలు ప్రవేశపెట్టి ప్రేక్షకులను ఆనందపరుస్తారట.

ఆదరణల లేక అంతరిస్తున్న కళ:

తూర్పు భాగవతంగా శతాబ్దాల తరబడి ప్రసిద్ధి చెంది, ప్రజలను అలరించిన,ఈ బాణీ, ఈనాడు అన్ని జానపద కళారూపాలు ఎలా శిధిలావస్థలో వున్నాయో ఇదీ అలాగే క్షీణదశలో వుంది. నాటి ఆదరణ ఈనాడు లేదు.

ఒకప్పుడు విజయనగరం, బొబ్బిలి, మాడుగుల, కళింకోట, మందసా, చోడవరం, చీకటి కోట, ధారాకోట, సాలూరు, పాఅర్వతీ పురం మొదలైన సంస్థానాలు, జమీందారులూ, ధనవంతులూ, పండితులూ, మహా విద్వాంసులూ, ఈ కళను ఆదరించి పోషించారు. ప్రజలు ఆదరించారు హర్షించారు, పోషించారు.

నాటి ఆదరణ ఈనాడు లేదు:

ఈ కళా రూపానికి, నాటి పోషణ ఈనాడు లేదు. మహా విద్వాంసులైన భామ వేషధారులూ, మహా విద్వాంసులైన మార్ధంగికులు, కొద్ది మంది మాత్రమే కొన వూపిరితో వున్నారు. ఇలాగే కొంతకాలం జాగు చేస్తే ఈ కళారూపం నామమాత్రం కూడ లేకుండా పోతుంది. అక్కడక్కడ మిగిలివున్న ఆయా విద్వాంసుల బాణీని రికార్డు చేయాలి, డాక్యుమెంటరీలు తీయాలి. వేష భూషణ అలంకారాలను భద్రపరచాలి. అక్కడక్కడ మిగిలి వున్న వృద్ధ కళాకారుల ద్వారా ఈ నాటి యువతరానికి గురుకుల పద్ధతిలో ఈ బాణీని అభ్యసింపచేయాలి.