Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/582

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
పతాక సన్నివేశం:

ఉరుములు వాయిద్యం భీకరంగా సాగే సమయంలో చుట్టూ మూగిన ప్రేక్షకులు తెల్లపోయి చూస్తూ వుంటారు. ఉరుముల వాయిద్యాల హోరును తట్టుకోలేని వారు దూరంగా నుంచుంటారు.

పూనకం వచ్చి వూగిపోయే వారిని చూసి ప్రేక్షకులు అరుపులతో, కేకలతో అట్టహాసం చేస్తారు. నిజంగా దేవతే పూనిందన్నంత భ్రమలో మునిగిపోతారు ప్రేక్షకులు. ఈ సమయంలో వురుములోళ్ళు చేసే హావభావాలు చూడవలసిందే కాని వ్రాయ నలవికాదు.

చివరగా వురుములోళ్ళు కథను పూర్తి చేసి మంగళం పాటలో ఒక్కొక్క దేవత పేరు చెపుతూ, రెండు చేతులెత్తి మొక్కుతారు. మంగళం పాట పాడి గంగమ్మ తల్లికి భక్తితో నమస్కారం చేసి నృత్యాన్ని పూర్తి చేస్తారు.

ప్రతిసారీ మంగళం పాడుతూనే తమ నృత్యం ఆపుతారు. గేయంలో అనేక మంది దేవతల్ని వేడుకొంటారు. చరణాలన్నీ పాడే సమయంలో, పల్లవి ఎత్తుకునే సమయంలో ఒక రకమైన లయలో పాడటం వుంటుంది. ఈ పల్లవిని ఎత్తుకునే సమయానికి ముందుగా ఒక్కొక్క దేవత పేరు చెప్పటం, రెండు చేతులెత్తి మొక్కటం చేస్తూ వుంటారు. కథా కార్యక్రమం అంతా పూర్తి కాగానే బండారు బొట్టును నుదుట పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళి పోతారు.

కళాకారులు:

ఈనాడు అనంతపురం జిల్లాలో వురుముల కథల్లో పాల్గొనే కళాకారులు ఉరుముల నారాయణ__ ఉరుముల నారాయణ స్వామి__ వురుముల నాగన్న__ ఉరుముల చంద్రప్ప__ ఉరుముల ఆంజనేయులు మొదలైన వారు కళను ప్రచారం చేస్తూ, దేవతల కొలువులు చేయిస్తూ

జీవితాలను సాగిస్తున్నారు. ఇలా ఉరుములోళ్ళు ధర్మవరం, సుబ్బారావు పేట, ముస్టూరు, గూగూరు, మేడాపురం, రేగాటిపల్లె మొదలైన చోట్ల వున్నారు. ఈ మాదిరి ఉరుముల బృందాలు ఆంధ్రదేశంలో మరెక్కడా లేవు.