కోకొల్లలుగా కోలాట నృత్యాలు
ఆంధ్ర ప్రజాజీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడ తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుకుపోయింది. పెద్దల్నీ, పిల్లల్నీ అందర్నీ అలరించిన కళారూపం కోలాటం.
కోలాట నృత్యాలు ప్రతి పల్లెలోనూ విరామ సమయాల్లో రాత్రి పూట పొద్దుపోయే వరకూ చేస్తూ వుంటారు. భక్తిభావంతో దేవుని స్థంభాన్ని పట్టుకుని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందూ కోలాటాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోలాట నృత్యాలను పెద్ద పెద్ద తిరుణాళ్ళ సమయంలోనూ, దేవుళ్ళ ఉత్సవాలలోనూ బహిరంగంగా వీథుల్లోనూ ప్రదర్శిస్తారు.
- కోలాట ప్రస్తావన:
పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో అనేక జానపద కళా రూపాలను వర్ణిస్తూ కోలాటాన్ని కోలాట గొడియ అని వర్ణించాడు. ఇతర నృత్య విశేషాలను వర్ణించినంతగా కోలాట గొడియను గురించి అంత గా వివరించనందువల్ల సోమనాథుని కాలానికి కోలాటం అంతగా అభివృద్ధి పొందలేదని వూహించవచ్చు.