పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/564

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైలపోలూ, తెల్లపాలు తీసినపుడు నాగవల్లి, వీరబోనం సమయాల్లోనూ డోలు వాయిద్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సన్ని వేశాల్లో ఎన్నో డోళ్ళ తోళ్ళ నుపయోగిస్తారు. ఉధృత వాయిద్యపు వరుసలతో పాటూ రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తూ వాయించడమే కాక డోలుకు కటిన తాళ్ళను పళ్ళతో కరిచి పట్టి నృత్యం చేస్తూ వాయిస్తారు. కూర్చుని డోలును వీపునకు ఆనించి చేతులను వెనకకు త్రిప్పి, డోలును వాయిస్తూ విన్యాసాలు చేస్తారు. ఈ డోళ్ళు "ధిళ్ళెం, భళ్ళెం... ధిళ్ళెం... భళ్ళెం" అని ధ్వని నిస్తాయి. ఈ విన్యాసాలకు తోడు కళాకారుల నైపుణ్యానికి తగినట్లు మరి కొన్నీంటిని జోడించి డోలు నృత్యంగా తయారు చేశారు. ఇలాంటి ఒగ్గు డోలు నృత్య బృందాలు, బండి పెద్దాపురం, జట్టు, మల్లెల బీరప్ప జట్టు, సుక్కా సత్తెయ్య జట్టు మొదలైనవి ప్రఖ్యాతి వహించాయి. ఇలా ఒగ్గు కథా బృందాలు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాయి.

కథా ప్రారంభం.

ఒగ్గుకథ ఉజ్జయిని మహంకాళీ స్తుతితో ప్రారంభిస్తారు. అనంతరం గణపతి ప్రార్థన, శారద ప్రార్థన చేసి కథకుడు వ్రేలి అందెలు పట్టుకుంటాడు. వంతగాడు గొంగడి మీద వేసుకుని కర్ర చేత బట్టుకుని గొర్రెల కాపరిలా వుంటాడు. తాళం వేసే వ్వక్తి అవసర మైనప్పుడు కంజరి వాయిస్తూ వుంటాడు.

ఇటీవల కొంత మంది ఒగ్గు కథలుగా "హరిశ్చంద్ర, పార్వతి పరీక్ష, శివ తాండవ మహారాజు, నలపతి మహారాజు, దుర్గపతి మహారాజు, సారంగధర, రత్న మాణిక్యం, సూర్య చంద్రుల కథ, నాగరాజు కథ " మొదలైన జానపద, పౌరాణిక, కాల్పనిక కథలు కూడ చెపుతున్నారు.

నేటి ఒగ్గు కథకులు:

ఈనాడు తెలంగాణాలో ఒగ్గుకథ చెప్పే బృందాలు వరంగల్లు, నల్లగొండ, హైదరాబాదు జిల్లాలో వున్న ఏభై బృందాలలో నాలుగు దళాలు మాత్రమే బహుళ ప్రచారంలో వున్నాయి.

వాటిలో ప్రధాన కథకులు నేర రామస్వామి డెబ్బై సంవత్సరాలు, చీమల కొండూరు, భువనగిరి తాలూకా, నల్లగొండ జిల్లా.