Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/540

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
చెంచు నాటకాలు:

ఆ కాలంలో చెంచు నాటకాలను గొల్ల వారే ప్రదర్శిస్తూ వుండే వారు. వీరి నాటకాలనూ అనాటి పల్లెటూళ్ళలో చాల పేరు పొందాయి. ప్రతి గ్రామంలోనూ వీరు నాటకాలను ప్రదర్శిస్తూ వుండేవారు. ఆ వీధిలో వారు నాటకం ఆడించారని వీరూ, వీరు ఆడించారని వారు, ఇలా ప్రతి వీధిలోనూ ప్రదర్శించటంతో,ఎక్కువ రోజులు ఒకే గ్రామంలో వుండి, తగిన పారితోషికాలను సంపాదించుకుని మరో గ్రామానికి తరలి వెళుతూ వుండేవారు.

చెంచు నాటకాలలో ముఖ్యమైన ఇతివృత్తం అహోబల నారసింహ స్వామి చెంచీతను, అంటే చెంచువారి కన్యను మోహించి వివాహం ఆడటం.

ఈ ఆహోబల క్షేత్రం కర్నూలు జిల్లాలో చెంచు వారు నివశించే అడవి మధ్య ఒక కొండ వుంది. ఆ కొండ మీద నరసింహ స్వామి దేవాలయం వుంది. స్వామి ఉత్సవ సమయంలో చెంచు పడుచులు విల్లంబులు చేతపట్టుకుని చురుకుగా యాత్రికుల మధ్య స్వేచ్ఛగా చకచకా తిరుగుతూ స్వైర విహారం చేస్తూ వుంటారు. ఆ చెంచీత కథనే గరుడాచల మహత్యం అని పూర్వ కవి యక్షగానంగా వ్రాశాడు. దాని ననుసరించి అనేక మంది ఆ యక్షగానాన్ని ప్రదర్శించారు.