పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/528

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రపంచంలో ఎక్కడా నీటి చుక్క లేదు. పార్వతికి ఏ దారి దొరకక గంగను బ్రతిమలాడింది. అందరూ వెండి కొండకు చేరారు సుఖంగా వున్నారు.

సన్యాసి కవి గంగా వివాహంలో ఎన్నో వర్ణనలు వర్ణించాడు. ఈ కథలో సంభాషణలు అతి సహజంగానూ, సంవాదాలు చాల చమత్కారంగానూ వున్నాయి. గంగా గౌరుల సంవాదంలో కవి తెలుగు మాటల్ని చాల చమత్కారంగా వర్ణించాడు.

ఉదాహరణకు:

గౌరి॥ ఉన్న చోటను నున్న ఉండమన్నందుకు
తప్ప కను నీ జిహ్వ తరిగింతు గంగ

గంగ॥ నీవు తరిగిన కూర నేను తరిగిన కూర
వండి వడ్డింతుమే వనిత గౌరమ్మ

గౌరి॥ చెంప కాయలు గొట్టి చెవులూడదీతుగా
జగడ పోతుల మారి జాలారి గంగ

గంగ॥ నీవు గొట్టిన కాయ నేను గొట్టిన కాయ
గంప నింపింతుమే కాంత గౌరమ్మ.

గౌరికి కోపం రాగా శివుడు అర్థ నారీత్వాన్ని చక్కగా తెలియ చేశాడు. గంగకు మంగళ సూత్రం కట్టాడు.

సన్యాసి రాజు రచనలో నిండుగా లోకోక్తులు, నానుళ్ళు, జాతీయాలు వున్నాయి. శివుడు భార్యను గురించి చెప్పిన వాక్యాలు ఈ నాటి వారికి కూడ ఆదర్శ ప్రాయంగావున్నాయి.

ఎందరో హరిహరీ పదాలను రచించారు:

ఈ విధంగా హరిహరీ పదాలను ఎందరెందరో రచించారు. వారిలో కలగర్ల వేంకట కామయ్య "లక్ష్మణ మూర్ఛనూ" 1850 లో పసగాడ సన్యాసి రచించిన పదాలు "సారంగధర చరిత్ర" "శతకంఠ యుద్ధం" (శతకంఠ రామాయణం) గంగావివాహం మొదలైనవి రచించేడు.