Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
డగుల బరాయి:

ఇది వెదురుతో చేసిన వాయిద్యమే గాని పిల్లన గ్రోవి కంటే పెద్దది. దీని పొడవు 16 అంగుళాల నుంచి 20 అంగుళాల వరకు ఉంటుంది. రెండు నుంచి మూడు అంగుళాల వ్వాసం వుంటుంది. దీనికి మధ్యలో పది పన్నెండు అంగుళాల చాలు వుంటుంది. ఈ పెద్ద చాలుకు రెండు వైపుల పొడుగు పాటి చిన్న రంద్రాలు వుంటాయి. డంగు అనే ఒక కొయ్యముక్క సహాయంతో ధ్వనిని జనింప చేస్తారు. ఈ వాయిద్యాన్ని విడిగా కాకుండా అనేక ఇతర వాయిద్యాలతో పాటు ఉపయోగిస్తారు.

వెదురు పిల్లన గ్రోవి:

గోదావరి ప్రాంతంలో ఎక్కువ గ్రామాలలో ఇది బహుళ ప్రచారంలో వుంది. ఇతర చోట్ల కూడ పల్లె ప్రజలు అభిమానించే వెదురు వాయిద్యమిది. వూదే చోట ఒక రంధ్రమూ, మధ్య నుంచి రెండవ చివరి వరకు ఐదు చిన్న రంధ్రాలు వుంటాయి సాధారణంగా ఇది 21 సెంటి మీటర్ల పొడవు వుంటుంది.

తేతిడి:

సవరలు ఉపయోగించే ఈ వాయిద్యం గేదె కొమ్ముతో తయారు చేసినది. దీని పొడవు 12 నుంచి 15 అంగుళాల వరకూ వుంటుంది. సన్నగా చివరన వుండే వెదురుతో చేసిన సన్నని గొట్టాన్ని పేకగా అమర్చుతారు. బాగా దుమ్ము పట్టి వూది నప్పుడు పెద్దగా శబ్దం వస్తుంది.

పనార్:

పన్నెండు అంగుళాల పొడవు ఒక అంగుళం వ్వాసం కలిగిన ఈ వాద్యాన్ని కూడ సవరలు ఉపయోగిస్తారు. దీనికి ఒక వైపు మూసి వుంటుంది. రెండవవైపు ఖాళీగా వుంటుంది. మూసిన వైపు దీర్ఘ చతురస్రాకారంగా ఒక చిన్న రంధ్రం వుంటుంది. తాటాకు బద్దను మైనంతో రంధ్రం వద్ద అతికిస్తారు. తాటాకు బద్ద కదలిక ద్వారా రంధ్రం పరిమాణాన్ని మార్చుతుండవచ్చు. ఎడమ చేతి బొటన వ్రేలు ఇతర వ్రేళ్ళ మధ్య పట్టుకుని పెదిమల దగ్గరగా వుంచి ఈ వాద్యం నుంచి శబ్దాన్ని ధ్వనింప చేస్తారు.