పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/502

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గుండ్రంగా తిరుగుతారు. ఉత్సాహ ఉద్వేగాలతో చేసే నృత్య మిది ... అలాగే ఒరియాలో గొడ్డిబేట నృత్యముంది. గొడ్డి అంటే చిన్న రాళ్ళు. బేట అంటే ఏరుట అనే అర్థం. ఈ నృత్యంలో గిరిజన బృందాలు, రాళ్ళను ఏరుతున్నట్టుగా తలను దించుతూ, పై కెత్తుతూ నర్తిస్తారు. మంచి వూపుతో ముందుకు వంగుతూ లేస్తూ పాతిక అడుగులు ముందుకు సాగి, అదే పద్ధతిలో వెనక్కు వస్తారు. ఇలా నాలుగైదు సారులు వెనకకు ముందుకూ సమన్యయంతో అడుగులు వేస్తారు.

పోతార్ తోలా:

పోతార్ అంటే అడుగులు, తోలా అంటే సేకరణ. ఈ నృత్యంలో సగం మంది ప్రక్క ప్రక్కన ఒక వరుసలో నుంచుంటారు. వెనుక ఉన్నవారు, ముందున్న వారి భుజాలపై చేతులు వుంచుతారు; కుడి వైపుకూ, ఎడమ వైపుకూ, ఒక్కసారిగా తలను త్రిప్పుతూ బృందం యావత్తు ముందుకు వెడతారు. అడవిలో ఆకులు ఏరడాన్ని ఈ నృత్యం సూచిస్తుంది. అరకు లోయలో గిరిజనుల అడ్డ ఆకులను సేకరించడం ఒక చిన్నవృత్తి. సేకరించిన ఆకులను సంతలో అమ్ముతారు.

బాగ్ దింసా:

భగ్ అంటే ఒరియాలో "బెబ్బులి" అని అర్థం. అడవిలో భయంకరమైన జంతువులలో పెద్దపులి ఒకటి. పెద్ద పులి కనిపిస్తే ఎలా పారి పోవాలో చిన్న పెద్ద అందరూ తెలుసు కోవాల్సిన అవసరం వుంది. బాగ్ దింసా నృత్యం దీనిని తెలియజేస్తుంది. బృందంలో సగం మంది ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా మూగుతారు. తలను పై కెత్తుతూ ముని వేళ్ళ మీద నిలిచి వుంటారు. మిగతా సగం మంది చకచకా చుట్టు తిరుగుతూ లోపల ప్రవేశించి, పాము చుట్ట ఆకారంలో అంతా పరుచుకుంటారు. ఇలా అనేక సార్లు చేస్తారు.

వివిధ రకాలు:

నాటికారి, కుందాదింసా, బాయ దింసా అనే నృత్యాలు కూడా వున్నాయి. నాటికారి నృత్యం ఒక్కక్కరే చేసే నృత్యం, ముఖ్యంగా వాల్మీకి జాతి వారు. దీపావళి పండుగ రోజు నృత్యం చేస్తారు. మిగతా పండుగల సమయంలో ఇతర జాతులు కూడ నృత్యంలో పాల్గొంటారు.