నే నెందుకు రాయాలి?
అసలు ఈ పని నే నెందుకు చేయాలని నటరత్నాల గ్రంథంలో నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆ ప్రశ్నే మళ్ళీ ఇక్కడ కూడా వేసుకుంటున్నాను. అవును ఈ పని నేనెందుకు చేయాలి?
నాటకం, సినిమా, రేడియో, టీవి, వీడియో, ఆడియో లేని నా చిన్ననాడు పల్లె ప్రజలను అలరించి, ఆనందపర్చి, ఆనందడోలికలో ఊగులాడించి, ఈనాడు కాలగర్భంలో కలిసిపోతున్న నాటి జానపద కళారూపాలు, నన్ను ఉత్తేజ పర్చాయి. ప్రభావితుణ్ణి చేశాయి.
ఆ నాటి ప్రదర్శనాలను రాత్రి తెల్లవార్లూ కూర్చుని చూశాను. ఎన్ని కళా రూపాలు? ఎంత గొప్ప ప్రదర్శనాలు? వారు ఎంత గొప్ప కళాకారులు.
పది రూపాయల కోసం, పట్టెడన్నం కోసం వారు ఎంత నిస్వార్థంగా కళకు సేవ చేసారు? నా నటజీవితానికి తొలి రేఖలు దిద్దింది వారే. వారే నా మార్గదర్శకులు, వారే నా గురుదేవులు. నాకే కాదు నా ముందు తరాలవారికి, ఆ మాటకొస్తే ఈ తరం కళాకారులకు కూడ వారే కళామూర్తులు.
రెండువేల సంవత్సరాల ఆంధ్రుల సాంస్కృతీ వికాసంలో, నాటకరంగం ప్రారంభమయ్యే నాటికీ, తరువాత కాలానికి, ప్రతీకలుగా నిలిచివున్న జానపద కళారూపాలను, ఎందరు మహామహులు సృష్టించారో? ఎంతమంది కథలు వ్రాసి, కవిత లల్లి, కాలప్రవాహంలో కలిసిపొయ్యారో? ఎంతమంది కళాకారులు ప్రదర్శనాల సేవలో తరించి,తరించి అందుకే అంకితమై అంతరించి పొయ్యారో, ఆ అభాగ్యులను గురించి పట్టించుకున్న వారే లేకపొయ్యారు.
ఒకనాడు జాతినంతా ఉర్రూత లూగించిన జానపద కళారూపాలు, ఈ నాడు అంతరించి పోతున్నాయి. ఆ కళాకారులు అన్నమో రామచంద్రా యంటూ వీధుల్లో ముష్టెత్తుకుంటున్నారు. అందరిచేతా చీదరింపబడుతూ బ్రతుకుతున్నారు. ఒకనాడు దేశానికి జాతికి విజ్ఞాన వినోదా వికాసాలను కలిగించిన, ఆ మహోన్నత కళాకారుల నేటి దుస్థితి ఇది. అందుకే ఆ అపూర్వ కళారూపాలను ఆ కళాహృదయాలను, ఒక చోటకు చేర్చి, దేశానికి, ప్రజలకు తెలియ చెయ్యాలనిపించింది.