పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారు భారత కథల్ని చీరలపై చిత్రించి పెద్ద పెద్ద బొమ్మల సహాయంతో ప్రజానీకానికి పాడి వినిపిస్తారని డా॥ బి.రామరాజుగారు వారి జానపద గేయ సాహిత్యంలో తెలియజేసారు.

పై పద్యంలో వివరించిన మాదిరి కొమ్ముల్నీ వీరణాలనూ వాయిస్తారు. వీరణం పెద్ద డోలు వంటిది. కొందరు శంఖాలను కూడా పూరిస్తారు. గొల్లలలో అనేక తెగల వారు వున్నప్పటికీ ఆధిక సంఖ్యలో వున్నవారు ఎఱ్ఱ గొల్లలే. వీరి ప్రధానమైన వృత్తి ఆవుల మందలనూ, గొఱ్ఱెల మందలనూ పెంచుతారు. యాదవులకు ప్రధాన దేవతయైన గంగమ్మకు జాతర్లు మొదలైన వుత్సవాలు చేస్తూ వుంటారు. అలాంటి వుత్సవాలు దొనకొండ, అలవలపాడు, మొదలైన చోట్ల జరుగుతున్నాయి. దర్ట్సన్ పండితుడు ఈ గంగ పూజల్నీ వీరుల పూజలుగా పేర్కొన్నాడు.

గొల్లలు సాధారణంగా అందరు వైష్ణవులే. అయినా వీరిలో కొందరు శైవులు కూడా వున్నారు. సంఘంలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్యజాతుల తరువాత గొల్లలే అధికులని చెపుతారు. రెడ్లు, వెలమవారు, గొల్లల సరసన కూర్చుని తినడానికి వెనుకాడరు. యాదవులకు అంతటి స్థానముందని గుర్తించారు.

గొల్లలలో కొన్ని తెగలున్నాయి. వారిలో ఎఱ్ఱ గొల్లలు అందరికంటే శ్రేష్టులు. గొల్లసుద్దులు చెప్పేవారు ఎఱ్ఱ గొల్లలే. గొల్లల వృత్తి మేకలను పెంచటం, గొల్లసుద్దులను భిక్షాటనగా ఉపయోగిస్తారు కూడా. వీరు కూడా గొల్లసుద్దుల్లో హరి హరి నారాయణా ఆఁ. అంటూ పల్లవిని కొంత మంది వాడుకోవటం కూడా కద్దు.

ఉదాహరణకు:

గొల్లల గోత్రాలు గొఱ్ఱెల కెరుక
గొఱ్ఱెల గోత్రాలు గొల్లల కెరుక
వీరి వారి గోత్రాలు తోడేళ్ళ కెరుకో హరి, హరి.

అంటూ సంఘంలో వున్న చెడును తొలగించటానికి ఈ పద్ధతిలో కొందరు, విడిగా సుద్దులు చెపుతారు.