పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముఖ్యంగా వైశ్యులు కన్యకా పరమేశ్వరినీ, సాలెవారు చౌడేశ్వరినీ, విశ్వబ్రాహ్మణులు కాళికా శక్తినీ, కురుబలు,కురుములు వీరభద్రుని కొలుస్తారు.

వీరి ఖడ్గ ప్రదర్శనం వీరా వేశంతో కూడుకొని వుంటుంది. స్త్రీలూ, పురుషులూ ఒక గుంపుగా వీధిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి ముందు సాగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంపులోనుంచి ముందుకు వస్తాడు. సాంబ్రాణి ధూపంతో అతనిని ముంచెత్తుతారు. సన్నాయి బూరలతో, డోళ్ళతో, శంఖాలాతో, ఖడ్గధారిని ఆవేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గధారి ఖడ్గం చదువుతాడు.

చౌడమ్మ ఖడ్గం:

చౌడమ్మ ఖడ్గం రాయల సీమలో ప్రచారంలో వున్నదనీ, దీనిని పూరించిన వారు, బీరే బాలప్ప, తొగట వీరక్షత్రియ అనీ, చేనేత వృత్తి వారనీ, అనంతపురం జిల్లా, రాయదుర్గం తాలుకా, పెద కాకుంట్ల గ్రామస్థులనీ తూమాటి దోణప్ప గారు నివేదిస్తున్నారు.

ఆహహా శాంభవే..... ఆహహా శాంభవే
వీభూతి ఒక చేత ... వీరంగ మొక చేత
ఘన ఘనా గంటలే ... ఘల్లుమనగా
చక్రంబు త్రిప్పితే భూచక్ర గొడుగులు
చుక్కలన్నీ గూడి ప్రగ్గడిల్లా
అహహా నీమాయలు నెలకొంటినే నైక తాంబా
సరస సద్గుణ నికురాంబ శ్రీ శారదాంబా.

అంటూ స్త్రోత్రాలను చేస్తారు. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే, దీనిలో భక్తి భావమూ, శైవమత ప్రచారమూ ఇమిడి వున్నాయి.

ఇలాంటి ఖడ్గ నృత్యాలు దక్షిణ దేశంలో తిరువాన్ కూరులో వున్నాయి. ఈ నృత్యాన్ని "పాతాయం" అని పిలుస్తారు