పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/472

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిత్తులమారి కత్తుల గారడీ


బతుకు పోరాటం కోసం కత్తులతో చెలగాటం ఆడే కత్తుల గారడీ వాళ్ళను ఈ నాటికి ఆంధ్రదేశంలో అక్కడక్కడ చూస్తూ వుంటాం.

కూటి కోసం కోటి విద్యలన్నట్లు పొట్ట పోసుకోవటానికి అనేక విద్యల్ని ఆనాటి భిక్షకులు ఆయా విధానాలను అవలంబించారు.

ఆయా విధానాల ద్వారా ప్రజలను అకర్షించీ, ఆనందపర్చీ, వారిని మెప్పించీ, వారి ద్వారా పారితోషికాలను పొందుతూ, వారి జీవితాలను, వాటితో వెళ్ళబుచ్చుకుంటూ కాలం గడిపేవారు ఎంతో మంది కనబడుతూ వుంటారు.

కొందరు కళారూపాలను ఎన్నుకుంటే మరి కొందరు, గారడీలనూ, మంత్ర తంత్రాలనూ, మాయా జాలాలనూ అనుసరించారు. మరి కొందరు ఆట పాటలను అనుసరించారు.

ఎవరు ఏది అనుసరించినా ప్రజలను ఎలా ఆకర్షించాలనేదే ముఖ్య విషయం.