పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/471

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుంభం కూడుపెట్టిన తరువాత గంగమ్మలను రజకులు ఎత్తుకుంటారు.ఆసాదివారు అనుసరిస్తారు. వారు ముందుగా గంగ మిట్టవద్దకు వెళ్ళి,అక్కడనుంచే సువర్ణముఖినదీ తీరానికి వెళతారు.ఆసాది వాడు బూతుపదాలు పాడుతూ వెళతాడు.జనం కూడ అతనిని అనుసరిస్తారు. దీవెన పదాలు పాడిన తరువాత గంగలను స్వర్ణముఖిలో నిమజ్జనం చేస్తారు.

ఇలా పూర్వ సంప్రదాయంతో తరతరాలుగా వస్తున్న ఈ గంగ జాతర్లను జరుపుతూ ఆ వుత్యాహంలో ఎన్నో జానపద గేయాలను, జానపద నృత్యాలను, జానపద వాయిద్యాలను ప్రయోగించి వుత్సవాలను జరుపుకుంటున్నారు.

కాలంమారిన దృష్ట్యా నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ గంగజాతర్లు కొంచెం తగ్గినా వెనుకబడ్డ గ్రామాలలోనూ, వెనుకబడ్డ జాతుల లోను ఈ గంగజాతర్లను భక్తిభావంతో చేస్తూనేవున్నారు.మన జానపద విజ్ఞానానికి గుర్తులు గంగ జాతర్లు.