- నట్టింటి పోలేరమ్మ:
గ్రామంలో గంగమ్మలను స్థాపించిన తరువాత, చిన్నలూ, పెద్దలూ చుట్టాలతో ఇల్లు నిండి పోతుంది. అందరూ క్రొత్త బట్టల్ని ధరించి అమిత వుత్సాహంతో వుంటారు. ప్రతి ఇంటిలోనూ నట్టింట పోలేరమ్మను ఎవరికి వారు ఒక గోడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ...మూడు విస్తళ్ళలో కుంభం కూడును పెట్టి పైన గంగమ్మల పెట్టిన మాదిరే కూరలను పెడతారు. పిండితో చేసిన ప్రమిదల్లో మూడు దీపాలు వెలిగించి మూడు విస్తళ్ళల్లో పెడతారు. గంగమ్మ కదిలే వరకూ ఈ దీపాలు ఆరిపోకుండా చూస్తారు. వారికున్న మ్రొక్కులన్నిటినీ తీర్చుకుంటారు. చీరెను నెట్టి కోరికలు కోరుకుంటారు.
అంతే కాక ఒక కుండలో అఖండలం వెలిగించి, నట్టింటి పోలేరమ్మ వద్ద పెడతారు. తరువాత ముత్తైదువలు దానిని ఎత్తుకు వెళ్ళి గంగమ్మ వద్ద మూడు ప్రదక్షిణాలు చేసి కుండను ఎత్తి పగల కొడతారు. పగిలిన రెండు మూడు పెంకుల్ని ఇంటికి తెచ్చుకుంటారు. పగిలిన పెంకులు ఇంట్లో వుంటే ఏ ఆపదా రాదని అలా చేస్తారు.
గంగమ్మను కదిలించిన తరువాత ఇంటిలో గోడకు పెట్టిన పోలేరమ్మ బొట్టును తుడిచి వేస్తారు.
వెంకటగిరిలో ఈ పోలేరమ్మ జాతరను వైభవంగాజరుపుతారు. వెంకటగిరి పోలేరమ్మను గోడకు పెట్టే బొట్లుతో కాకుండా నట్టింటిలో పీట వేసి పీట పైన బోనం కుండను గాని, దీపాన్ని గానీ పెట్టి దానిని దేవతగా పూజిస్తారు. అస్పృశ్యుడు, ప్రవేశార్హత లేని ఆసాది ఆరోజున నట్టింటి లోకి గంగమ్మ ప్రతీకగా భావించే త్రిశూలంతో ప్రవేసిస్తాడు. ఇంటి వారిని అదిరించి బెదిరించి కట్నాలు కానుకలు వసూలు చేసు కుంటాడు.
- గణాచారులు:
గంగమ్మలు దిగినప్పటి నుంచీ గంగమ్మల వద్ద జరిగే హడావిడి ఇంతా అంతా అని చెప్పలేం. ప్రతి వారికీ గంగమ్మ ఆవహించినట్లు గణాచారులై పోతారు. అట్టహాసంతో ఆవేశంతో వూగి పోతారు. ఈలలు, కేకలు, గణాచారుల గంతులు, ఆసాదుల డప్పు వాయిద్యాలు ఎవరికి తోచినట్లు వారు నృత్యాలు, కొందరు గంగను స్తుతించడం, కొందరు తిట్టటం, కొందరు ఆవేశంతో ఏడుస్తారు. కొందరు భూమి