కుమ్మరి వచ్చి మట్టితో ఒక్కో వీథికి ఒక్కొక్క గంగమ్మ చొప్పున ఏడు వీథులకూ ఏడు గంగమ్మలను తయారు చేసి, ముఖ్యంగా ఇది కాళహస్తి విషయం. ముత్యాలమ్మ గుడి వీథిలోనూ, పూసల వీధిలోనూ, సన్నిధి వీధిలోనూ, గుడి వీధి, గాంధీ వీథి, కొత్త పేట వీథి ఇలా గంగమ్మలతో పాటు ప్రతి గంగమ్మకూ ఇద్దరేసి ఉప గంగమ్మల చొప్పునా 14 ఉప గంగమ్మలను కూడ అందంగా తయారు చేసి పసుపు కుంకాలతో పూలతో అలంకరించి, దాగెర అనే వెదురు గంపలో వేపాకు పెట్టి దాని పైన మూడు గంగల్ని పెడతారు.
- అర్థరాత్రి గంగమ్మ:
అలంకారాలు ముగిసేటప్పటికి అర్థ రాత్రి అవుతుంది. గంగమిట్ట దగ్గరకు గంగలు చేరగానే పంబల వాడు గంగమ్మ కథను క్లుప్తంగా చెపుతాడు. ఆ తరువాత చిన్నకోడి మెడ విరిచి అగరం ఇస్తారు. ఏడుగురు గంగమ్మలకు, రజకులు (చాకలి వారు) ఏడు కుంభాలు పెడతారు. ఈ కుంభాలకు కావలసిన సరంజామానంతా ఇస్తారు. కుంభంపైన, ములగ ఆకు కూర, వంకాయ కూర, ఎండు చేపల పులుసు పెడతారు. ప్రతి కుంభం పైన పిండి దీపం వెలిగించి పొట్టేళ్ళను బలి ఇస్తారు.
ఈ తతంగమంతా పూర్తి అయిన తరువాత గ్రామంలో గంగమ్మలను దించుకోవడానికి ప్రతి వీథి లోనూ ఒక గుడిని నిర్మిస్తారు. ఆ గుడిని పందిరిగా వేసి, వేపాకులు వ్రేలాడ గట్టి గుడిని అలంకరిస్తారు.
ఏడుగురు రజకులూ గంగమ్మలను ఎత్తు కుంటారు. మేళ తాళాలతో, ఆట, పాటలతో ముందుగా ముత్యాలమ్మ గుడి వద్దకు వస్తారు. పంబల వాడు కోడి మెడను విరిచి హారం ఇస్తాడు.
ఇలా గంగమ్మలు వచ్చే దారిలో ప్రతి చోటా రజకులు జంతు బలులతో రక్త తర్పణం చేస్తారు. ముత్యాలమ్మ గుడి వద్ద ఆ వీథి గంగమ్మ దిగగానే, ఏ వీధి గంగమ్మ ఆవీథికి వెళ్ళి పోతుంది. ప్రతి వీథి గంగమ్మ ఆ వీధిలోని వారు జంతువుల్ని బలి ఇస్తారు.
ముత్యాలమ్మ గుడి వద్ద దిగిన గంగమ్మను శక్తివంతమైన దానినిగా భావిస్తారు. అందుకే ఆమెను ముందుగా ప్రతిష్టిస్తారు.