- వేష ధారణ:
పులి వేష ధారణ చాల కష్టమైది. మామూలు వేషాల్లాగ, ఎదో ముఖానికి ఇంత రంగు పూసి తుడిచి వేయడం లాంటిది కాదు. శరీరంలో అన్ని భాగాలనూ వార్నీషు రంగులతో ముంచి వేస్తారు. వార్నీషుతో గానీ, కర్పూర తైలంతో గానీ, పసుపు రంగు పొడి కలిపి, శరీరమంతా చిత్రిస్తారు. రంగుతో చారలను చిత్రిస్తారు. ఈ నల్లటి చారలు వల్ల పెద్ద పులి ఆకారం వస్తుంది. తలకు, కరాణం, మాస్క్ ధరిస్తారు. వీటిలో రెండు రకాలున్నాయి. ఒకటి తోలుతో కుట్టబడిన పెద్దపులి తల ఆకారాన్ని కలిగి వుంటుంది. రెండవది, ముఖాన్ని కూడ కప్పబడే పులి తల మాదిరి కవచాన్ని ధరిస్తారు. అయితే సర్వ సాధారణంగా తలకు మాత్రం పులి తల ఆకారాన్ని తగిలించి, కళ్ళకు నల్ల కళ్ళ అద్దాలను ధరిస్తారు. మొలకు లంగోటీని ధరిస్తారు. నడుముకు బెల్తు వేసి ఆ బెల్టుకు వెదురు బద్దలతో ఎటుపడితే అటు వంగ గల పులి తోకను తయారు చేసి, తోక చివర గుండ్రని ఆకారంలో రంగు కాగితాలతో అలంకరించ బడిన బుట్టను తయారు చేస్తారు. ఆ తోకను మరొకరు పట్టుకుంటారు.
హంగులన్నీ సమకూర్చుకున్న తరువాత ఈ పులి వేషం బజారులోకి వస్తుంది. నిజంగా పెద్ద పులే వచ్చిందా అన్నంత భ్రమలో ముంచేది.
- డప్పుల హంగు:
పెద్ద పులి ప్రవేశానికి హంగుగా రెండు డప్పులు గంభీర ధ్వనులు చేస్తూ వుంటే, ఆ ధ్వనులతో ఉత్తేజం పొందిన పులి వేష ధారి, హుందా అయిన పులి నడకలతో గంభీరపు చూపులతో వాయిద్యానికి తగినట్లు నృత్యం చేస్తూ చికు చిక్కు చిక్కు చికు చిక్కు అంటూ ఎగిరి పల్టీలు కొడుతూ ఉధృత వాయిద్యానికి అనుగుణంగా నృత్యం చేస్తూ, పిల్ల జంతువులను వేటాడినట్లు ఆకలి గొన్న పులిలాగా వివిధ చేష్టలు చేస్తూ, పొంచి వుండి ఆమాంతం ఏమేక పిల్లనో నోటితో కరచి పట్టినట్లు నటిస్తారు.
ఒక్కొక్క సారి ఇరువురు పులి వేషాలను ధరించి ఎదురు బొదురుగా నిలబడి రెండు పులులూ పోట్లాడు కుంటున్నట్లు వాయిద్యాల ధ్వనులతో భయంకరంగా పోట్లాడుతూ ఎగిరి గంతులు వేస్తూ, తొడగొట్టి అరుపులతో, కేకలతో నానా హంగామా చేస్తారు.