పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/430

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఈ పండుగ రోజుల్లో పుట్ట మన్నుతో ఒక బొమ్మను చేసి, బహుళ పంచమి నాడు దానిని ప్రతిష్టించి దాని పైన, ఒక కలశాన్ని వుంచి, కలశంపైన పశుపు ముద్దతో గౌరమ్మను నిలిపి పూలతోనూ, పసుపుతోనూ అలంకరిస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటిలోనూ చేయక పోయినా, గ్రామానికి ఒక గృహంలో చేసినా సరి పోతుందని వారి అభిప్రాయం.

బొడ్డెమ్మను నిలిపిన తరువాత ఆ వాడలో వున్న ఆడపిల్లలందరూ అక్కడ గుమి కూడుతారు. ఈ వినోదాన్ని చూడడానికి పెద్ద లందరూ వస్తారు. ఇలా ఎనిమిది రోజులూ కన్నె పడచులు ఆడుకుంటారు.

తరువాత నవమి రోజున కోడి కూసే సమయాన స్త్రీలు లేచి, పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి గోరు వెచ్చని జీడిగింజల నూనెతో తలంటి పోసుకుని నూతన వస్త్రాలు ధరించి అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాపు వేసి బతకమ్మలను పేర్చి గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మగా పెడతారు. పసుపుతో ముద్ద గౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకాలతో అలంకరించి పగలంతా అలాగే వుంచుతారు.

సాయంత్రం పిన్నలు, పెద్దలు, నూతన వస్త్రాలు ధరించి స్త్రీలు, వివిధ అలంకారాలను అలంకరించుకుని బతకమ్మలను చేత బట్టుకుని చెరువు కట్టకో, కాలువ గట్టుకో దేవాలయానికో వెళ్ళి బతకమ్మలను మధ్య వుంచి, బాలికలు, కన్నె పడుచులు, స్త్రీలు వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, గొంతెత్తి ఒకరు పాడగా వలయాకారంగా తిరుగుతున్న వారు ఆ పాటను అనుసరిస్తూ పాడుతారు.

ఆ దృశ్యాన్ని గ్రామస్తులందరూ చూచి ఆనందిస్తూ వుంటారు. మగపిల్లలు కొయ్య గొట్టాలలో, కాగితపు అంచులను కన్నెపిల్లల పైనా స్త్రీల పైనా ప్రయోగిస్తారు.

బతకమ్మ పాటలు, ఒకో ప్రాంతంలో ఆయా మాండలిక పదాలతో ప్రతి చరణాంతం లోనూ, ఉయ్యాలో అని, కోల్ కోల్ అనీ, చందమామా అనీ, గౌరమ్మ అనీ పదాలు పాడతారు. పాటల్లో లక్ష్మీ సరస్వతుల స్తోత్రాలేగాక, అనేక పౌరాణిక గాథలైన, శశి రేఖ, సతీ అనసూయ, కృష్ణలీల, సీతా దేవి వనవాసము మొదలైనవే గాక, సారంగధర, బాలనాగమ్మకు సంబంధించిన పాటలు కూడా పాడుతూ వుంటారు.