పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పక్కన్న నీళ్ళు బారు, పక్కన్న నీళ్ళు బారు
కంచుదే బోర తల్పులు కదల వోరన్నా
నీ ఇంటి నా యింటి నడుమా
నిమ్మ కొమ్మనీడ నుండు
సరసమైన జాజీ తోటా సంపంగి వనమే
వచ్చేకి మనసుంటే
నిమ్మ కొమ్మ నీడ నుంటా
మాటు మణిగినంక రావో
జారుట్ల రామా

ఇలా సాగుతుంది జట్టి జాము పాట.

మరో పిల్ల కథ:

ఈ పిల్ల యెవరో బట్ల బయకారి హంస వింశతి, శుక సప్తతి కథలో లోని జగ ఱాగలకు జాణ తనము నేర్ప గలిగిన సీతాకోక చిలుక, తేలు కుట్టిందని ఊరూ వాడ పిలిచింది. సరసుని దగ్గరు చేరుకోవటానికి అదొక సాకు. ఈ పాట నెక్కువగా యవ్వనంతో వున్న బాలికలు పాడే పాట.

రెడ్డోల్ల కుచ్చెండ్లే తుమ్మెదా తేలైన కుట్టింది తుమ్మెదా
యా యేల్కి కుట్టింది తుమ్మెదా నడి మేల్కి కుట్టింది తుమ్మెదా
మా యంకి చెప్పండి తుమ్మెదా మందైన బంపమని తుమ్మెదా
మాయమ్మ దెచ్చింది తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా
మాయమ్మ దెచ్చిన మందు తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా
మామ దెచ్చిన మందు తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా
మావాళ్కి జెప్పండి తుమ్మెదా, మందైన బంపమని తుమ్మెదా
మగడు దెచ్చిన మందు తుమ్మెదా మరి మంటలాయె తుమ్మెదా
ఎదురింటి చిన్నోణ్ణి తుమ్మెదా ఇంటికి బిలవండి తుమ్మెదా
మందు మంత్ర మేసె తుమ్మెదా మది సల్లనాయె తుమ్మెదా.

ఈ విధంగా రాయల సీమలో అనేక రకాల జట్టి జాము పాటలున్నాయి. ముఖ్యంగా సంసార కుటుంబాల్లో స్త్రీలు పోషించే కళా రూప మిది.