పూజారులుగా వున్న కుమ్మరులూ, గొల్లలూ, కలిసి ఈ కుండలను తెచ్చి, అలంకారం చేసి దానికి పసుపు కొమ్ము కట్టి, కుండ మూతి చుట్టూ వేప మండలను కట్టి తలపై పెట్టుకుని ఇంటింటికి తిరిగి అమ్మవారికి చద్ది వసూలు చేస్తారు. పెరుగు మజ్జిగ ఉల్లిపాయ ముక్కలతో కలిపిన చద్ది అన్నం అమ్మవారికి బోనంగా వసూలు చేస్తారు.
గ్రామలో ప్రతి ఒక్కరూ ఈ కుండలో బోనం వేస్తారు. ఇలా చేసినందు వల్ల గ్రామలకు, కుటుంబాలకు వృద్ధి కలుగుతుందని వారి నమ్మకం. అమ్మవార్లూ, దేవతలూ అందరూ శాతిస్తారని నమ్మకం. అమ్మవారి పూజ అయిన తరువాత ఆ కుండలో వున్న పెరుగు అన్నాన్ని పూజారులుగా వున్న వారూ, అక్కడ పనిచేసే వారు పంచుకుని భక్తితో ఆరగిస్తారు. ఇంటింటికీ బోనాలు తిరిగేటప్పుడు సాంబ్రాణితో దూపం వేస్తారు. తప్పెళ్ళతో దరువు వేస్తూ వుంటే బోనాలను ఎత్తుకున్న వారికి పూనకం వస్తుంది. వీర తాళ్ళతో కొట్టుకుంటారు. వెంట వున్న వారంతా ఈలలతో కేకలతో నృత్యం చేస్తూ ఆవేశంగా చిందులు త్రొక్కుతూ ఒకరి మీద మరొకరు గులాముల్నీ వసంతాలనూ చల్లుకుంటారు.
తప్పెట్ల దరువుకు అనుకూలంగా చేసే చిందుల నృత్యం ఆవేశాన్ని కలిగిస్తుంది. ఈ వుత్సవాన్ని 9 రోజులు నిర్వహిస్తారు. గ్రామ దేవతలకు
ప్రతీకగా గరగలు పూజ లందుకుంటాయి.ఇలా చేయడం వల్ల అమ్మవార్లు శాంతిస్తారని వారి నమ్మకం. వూరంతా తిరిగిన తర్వాత ఆ గరగలనే బోనాలను అమ్మవారి ఎదురుగా వుంచుతారు.